ఏపీ దేశంలోనే మూడవస్థానం : మంత్రి రోజా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో మంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్నట్లు రోజా తెలిపారు. ఈ ఏడాది కాలంలో ప్రతిష్టాత్మక పర్యటనలు, సదస్సులు జరిగాయన్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ, శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఏడాదిగా తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలుగు సంస్కృతిని ప్రజలకు గుర్తు చేసేలా కార్యక్రమలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏపీ టూరిజం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం అందున్నట్లు పేర్కొన్నారు. యువతకు ఉపాధి దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. విజయవాడలో బెర్మపార్క్లో పర్యాటక అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఏడాది కాలంలో పర్యాటక శాఖలో జరిగిన అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర క్రీడాకారులకు ఎన్నో రకాల ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు. ఒక కళాకారిణిగా తోటి కళాకారులకు తనవంతు సాయంగా జగనన్న సాంస్కృతిక సంబరాలు నిర్వహించామని పేర్కొన్నారు. ఒబెరాయ్ హోటల్స్కు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. తిరుపతి టెంపుల్ టూరిజంతో పాటు విశాఖలో నేచురల్ టూరిజం అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. త్వరలో 50 ప్రాంతాల్లో నూతనంగా బోటింగ్ సదుపాయం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. టెంపుల్ టూరిజంలో ఏపీ దేశంలోనే మూడవస్థానంలో ఉందన్నారు.













