రోబోల తయారీ కేంద్రంగా ఏపీ
మనిషి మేధస్సుకు ఏమాత్రం తీసిపొని రోబోల తయారీకి ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారనుంది. ఈ మేరకు జర్మనీకి చెందిన యూరోపియన్ సెంటర్ ఫర్ మెకట్రానిక్స్‌తో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఎస్డీసీ) అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. దీనివల్ల రాష్ట్రంలో 40 వేల మంది మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇండో-యూరోపిన్ స్కిల్ సెంటర్స్ ఫర్ మెకట్రానిక్స్ అండ్ ఇండస్ట్రియల్ రోబోటిక్స్‌లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. జర్మనీకి చెందిన నిపుణులు శిక్షణ ఇస్తారు. నోడల్ రోబోటిక్ రిసెర్చ్ సెంటర్లనూ నెలకొల్పుతారు. విజయవాడలో జరిగే అవగాహనా ఒప్పంద కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కే. లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.













