పర్యాటక ప్రాంతంగా ఏపీని అభివృద్ధి చేస్తా : మంత్రి రోజా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గొప్ప పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని మంత్రి ఆర్కే రోజా అన్నారు. సచివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పర్యాటకశాఖ మంత్రిగా రోజా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పర్యాటకశాఖ ద్వారా ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. సముద్ర తీర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా రాష్ట్రంలో అనుకూలమైన టూరిజంను అభివృద్ధి చేస్తామన్నారు. ఏపీలో టూరిజానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డే బ్రాండ్ అంబాసిడర్ అని, అయన సంస్కరణలతోనే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు.
టెంపుల్ టూరిజం, ఏకో టూరిజం పై ప్రత్యేక శ్రద్ధ పెడతామన్నారు. రాష్ట్రంలో అనేక పర్యాటక వనరులున్నాయి. వాటిని గుర్తించి అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచుతామన్నారు. గ్రామీణ క్రీడాకారులు ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటాం. సీఎం జగన్ పాలనను పక్క రాష్ట్రాలలో సైతం ప్రశంసిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొడతాం. టీడీపీ, తోక పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. గండికోట నుంచి బెంగుళూరుకు పర్యాటకం కోసం బస్సు సర్వీసు ఏర్పాటుపై మొదటి సంతకం చేస్తా అని రోజా తెలిపారు.













