Rice scam: బియ్యం మింగిన మరో మాజీ మంత్రి
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ బియ్యం (Rice) అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇటీవల మాజీ మంత్రి పేర్ని నాని రేషన్ బియ్యం గోల్మాల్ కు పాల్పడ్డారు అని అధికారులు కేసు కూడా నమోదు చేశారు. ఇప్పుడు తాజాగా మరో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా బేతంచర్లలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) బంధువులకు గౌడాన్ లు ఉన్నాయి. వీటి నుంచి 1300 బస్తాలకు పైగా రేషన్ బియ్యం మాయమైనట్లు గుర్తించారు. సివిల్ సప్లైస్ డైరెక్టర్ మహేష్ నాయుడు నంద్యాల డిఎం రాజు నాయక్ ఈ లెక్క తేల్చేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
మాయమైన బస్తాలు ఈ మధ్య కాలానివే అని సమాచారం. గత ప్రభుత్వంలో మాయమైన వాటి గురించి కూడా ఇప్పుడు ఆరా తీసే పనిలో పడ్డారు. వాస్తవానికి 2019 ముందు బేతంచర్లలో సివిల్ సప్లైస్ కు సంబంధించిన గౌడాన్ లు ఏమీ లేవు. బుగ్గన సొంత నియోజకవర్గం డోన్ కు కర్నూలు… గుంతకల్లు, నంద్యాల నుంచి రేషన్ బియ్యం సరఫరా అవుతుంది. వైసిపి ప్రభుత్వం లో బుగ్గన మంత్రి కాగానే ప్యాపిలి, డోన్, బనగానపల్లి లోని పాయింట్లకు బియ్యం సరఫరా చేయడానికి బేతంచెర్ల లోనే రెండు బఫర్ గౌడాన్ లు ఏర్పాటు చేయించారు.
ఒకదానిని స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కు లీజుకు ఇప్పించారు. మరో దానిని తన బంధువు సన్నిహితుడు కలిసి ప్రైవేట్ గా నడుపుకునేలా ప్లాన్ చేశారు. ప్రస్తుతానికి ఎస్ డబ్ల్యూ సి కి చెందిన గోదామును అధికారులు తనిఖీలు చేయగా 398 బియ్యం బస్తాలు మాయమైనట్లు గుర్తించారు. అలాగే ప్రైవేటు గోడౌన్ లో 920 బియ్యం బస్తాలు మాయమైనట్లు లెక్క తేల్చారు. అయితే ఈ విషయాన్ని బయటికి రాకుండా సంబంధిత శాఖ అధికారులు వేరే చోట నుంచి బియ్యం బస్తాలు తెప్పించి అంతా సక్రమంగా ఉందని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మాయమైన బియ్యం విలువ దాదాపు 50 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. బియ్యాన్ని 43 రూపాయలు చొప్పున ప్రభుత్వం సేకరిస్తున్నది.













