ఎపి ఎన్నికల కమిషనర్ గా జస్టిస్ కనగరాజ్
ఆంధప్రదేశ్ నూతన ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)గా రిటైర్డ్ జడ్జి జస్టిస్ కనగరాజ్‌ను నియమిస్తూ ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ నూతన ఎస్ఈసీగా జస్టిస్ కనగరాజ్ శనివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ జడ్జిని నియమించాలని ఏపీ ప్రభుత్వం నిన్న (శుక్రవారం) ఆర్డినెన్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ మేరకు జస్టిస్ కనగరాజ్‌ను ఎస్ఈసీగా ప్రభుత్వం నియమించింది.
తమిళనాడుకు చెందిన జస్టిస్ కనగరాజ్ మద్రాస్ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. 1973 నుంచి న్యాయవాద వృత్తి లో ఉన్న జస్టిస్ కనగరాజ్ 1997లో మద్రాస్ హైకోర్ట్ జడ్జిగా నియమితులయ్యారు. హైకోర్టు జడ్జిగా అనేక కీలకమైన జడ్జిమెంట్లు ఇచ్చారు. 9ఏళ్ల పాటు హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన పనిచేశారు. విద్య, బాలలు, మహిళలు, వృద్ధుల సంక్షేమ అంశాలపై కనగరాజ్ కీలక తీర్పులు ఇచ్చారు. 1972లో మద్రాస్ యూనివర్శిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1973లో సేలం బార్ అసోసియేషన్ సభ్యుడిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సీనియర్ సిటిజన్స్ కేసులు సత్వరం పరిష్కరించిన రికార్డ్ ఈయనకుంది. మద్రాస్ హైకోర్టు, మధురై బెంచ్‌లోనూ ఆయనకు పనిచేసిన అనుభవం ఉంది. తమిళనాడు అంబేద్కర్ యూనివర్సిటీకి సెనెట్‌గా ఆయన వ్యవహరించారు. 2006లో హైకోర్టు జడ్జిగా పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి సుప్రీం కోర్టులో సీనియర్ అడ్వకేట్‌గా ఆయన ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు.













