చంద్రబాబు అరెస్ట్ లో రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేశ్ పాత్ర ఉందా..?
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. 14 రోజులపాటు ఆయన రిమాండ్ లో ఉండనున్నారు. అయితే ఆయనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఇప్పటికే కోర్టులో అప్పీలు చేశారు టీడీపీ నేతలు. అయితే డెవలప్మెంట్ లో అసలు అవినీతే జరగలేదని .. చేయని తప్పుకు చంద్రబాబును జైలుకు పంపించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే చంద్రబాబు చెప్పడం వల్లే నిధులు విడుదల చేశామంటూ అప్పటి ఆర్థిక శాఖ సెక్రటరీ రాసిన నోట్ ఫైల్ వల్లే చంద్రబాబు ఇప్పుడు జైలుకు వెళ్లారనే టాక్ నడుస్తోంది.
అయితే ఈ అంశాలపై అప్పటి ఆర్థిక శాఖ సెక్రటరీ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ స్పందించారు. తన వల్లే ఇప్పుడు చంద్రబాబు జైలుకు వెళ్లారనడాన్ని ఈయన తీవ్రంగా తప్పుబట్టారు. తానీ సీఐడీకి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగానే కేసు పెట్టారనడం దిగ్భ్రాంతి కలిగించిందని ఆయన అన్నారు. డెవలప్మెంట్ కేసులో అవకతవకలకు సంబంధించి గతంలోనే సీఐడీ పీవి రమేశ్ ను విచారించింది. దీనిపై ఆయన లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. ఆయన ఇచ్చిన స్టెంట్ మెంట్ ఆధారంగానే ఇప్పుడు చంద్రబాబును అరెస్టు చేశారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
నేను అప్రూవర్ గా మారానని.. అందువల్లే చంద్రబాబు జైలుకు వెళ్లారని వస్తున్న ప్రచారం సరికాదని పీవీ రమేశ్ అన్నారు. అసలు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి.. ఫైలే కనిపించడం లేదని.. అది లేకుండానే కేసు ఎలా పెడతారని పీవీ రమేశ్ ప్రశ్నించారు. ఈ విషయంలో ఆర్థిక శాఖ ఎలాంటి తప్పూ చేయలేదన్నారు. ఈ కేసుకు సంబంధించి సీఐడీ తీరు అనుమానాస్పదంగా ఉందన్నారు. నా స్టేట్ మెంట్ ను సీఐడీ తనకు అనుకూలంగా మార్చుకుందని తనకు అనుమానంగా ఉందన్నారు. గతంలో నిధులు విడుదల చేసిన వారి పేర్లు ఇప్పుడు కేసులో లేవన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఎండీ, సెక్రటరీల పాత్ర నిధుల విడుదలలో కీలకమని.. మరి వారు పేర్లు ఎందుకు కేసులో లేవని పీవీ రమేశ్ ప్రశ్నించారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి నాడు విధాన నిర్ణయాలు తీసుకున్న ఫైల్స్ ఇప్పుడు ఏమయ్యాయని పీవీ రమేశ్ ప్రశ్నించారు. ఆ ఫైల్స్ చూస్తే ఎప్పుడు ఏం జరిగిందో.. ఎవరెవరి పాత్ర ఏంటో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. అధికారులపై సీఎం ఒత్తిడి చేసి నిధులు విడుదల చేయించడం జరగదని తేల్చి చెప్పారు పీవీ రమేశ్. నోట్ ఫైల్స్ ఏమయ్యాయో సీఐడీ చెప్పాలని.. తప్పు చేసిన అధికారులను వదిలేసి సీఎంపై చర్యలు తీసుకోవడమేంటని ఆయన ప్రశ్నించారు. సీఎం కొన్ని వందల అంశాలను రోజూ పర్యవేక్షిస్తుంటారని.. ఆయా శాఖల అధికారులే కీలక బాధ్యత వహించాల్సి ఉంటుందని పీవీ రమేశ్ స్పష్టం చేశారు. అధికారుల తప్పులను నాయకులకు ఆపాదించడం కరెక్ట్ కాదన్నారు. ఇప్పటివరకూ పీవీ రమేశ్ నోట్ ఫైల్ వల్లే చంద్రబాబు అరెస్టు అయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు పీవీ రమేశ్ బయటికొచ్చి అసలు పాత్రధారులు వేరే ఉన్నారని చెప్పడంతో ఈ వ్యవహారం ఇంకెలాంటి మలుపులు తీసుకుంటుందనేది ఆసక్తి కలిగిస్తోంది.













