వైసీపీ ఓటమికి కారణాలెన్నో..
ఏపీ ముఖచిత్రంలో బలంగా ఆవిష్కృతమైన పార్టీ యువజన, శ్రామిక, రైతు(వైసీపీ) పార్టీ.2019లో ఏకంగా 151 సీట్లతో అదరగొట్టిన పార్టీ. టీడీపీ లాంటి బలమైన పార్టీని మట్టికరిపించిన చరిత్ర ఉన్న పార్టీ. అలాంటి పార్టీకేమైంది. ఐదేళ్లలో ఎందుకింత ప్రజావ్యతిరేకతను ముటగట్టుకుంది. ఈ ఓటమికి బాధ్యులు పార్టీ అధినేత వైఎస్ జగనా..? లేక పార్టీ ఎమ్మెల్యేలా..? కార్యకర్తలు కష్టించి పనిచేసినా.. వాలంటీర్లు అంటూ బలమైన వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నా.. ఎందుకిలా జరిగింది? ఇప్పుడిదే ప్రశ్న వైసీపీ నేతలను వేధిస్తోంది.
అమరావతి గ్రాఫిక్స్ అంటూ, చంద్రబాబు మాయ చేశారంటూ 2019లో వైసీపీ చేసిన ప్రచారాన్ని జనం నమ్మారు. అంతే కాదు.. అక్కడ ప్రకటనలే తప్ప, ఆస్థాయిలో నిర్మాణాలు లేకపోవడంతో .. ప్రజలు సైతం చంద్రబాబును తిరస్కరించారు. దీనికితోడు పవన్ కల్యాణ్ పార్టీ సొంతంగా పోటీ చేయడం, బీజేపీ సపోర్టు లేకపోవడంతో… టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితమైంది. ఇక అందులోనూ గెల్చిన వారిలో కొందరు. వైసీపీలో చేరారు. అయితే ఈ క్రమంలో వైసీపీనే తప్పుపట్టలేం. అంతకుముందు టీడీపీ సైతం ఇలాగే వ్యవహరించింది. ఈ పరిణామాలు జనంలో అధికార పార్టీపై కాస్త అసంతృప్తిని మిగిల్చాయి. ఏకంగా 151 సీట్లిచ్చినా ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు జగన్ అన్నభావన వ్యక్తమైంది.
ఇక దీనికి తోడు సీఎం జగన్ అభివృద్ధిని పక్కనపెట్టి, సంక్షేమాన్ని నమ్ముకున్నారు. ప్రతీ నెలా సంక్షేమ బటన్ నొక్కడం.. పార్టీ నేతలతో ఆహా, ఓహా అనిపించుకోవడం రివాజైంది. నేతలు సైతం జగన్ స్వభావానికి అనుగుణంగా నడుచుకోవడం మొదలుపెట్టారు. గ్రౌండ్ లెవల్లో ఎలా ఉందన్న అంశాన్ని సైతం.. జగన్ దగ్గరకు చేర్చేందుకు సిద్దపడలేదు. దీంతో అంతా తనకు అనుకూలంగా ఉందన్న భావనలో జగన్ మునిగిపోయారు. ఇక జగన్ పరాజయంలో ముఖ్యభూమికను ఐప్యాక్ పోషించిందని చెప్పొచ్చు. ఈ సంస్థ జరిపిన సర్వేలను జగన్ దగ్గరకు తీసుకెళ్లి, వాటి వివరాలు అందించేది. అయితే.. పాలనలోనూ ఐపాక్ జోక్యం చేసుకుందన్న ఆరోపణలు వినిపించాయి. దీంతో చాలా చోట్ల ఐపాక్ చెప్పినవారికే టికెట్లు కేటాయించారన్న భావన నెలకొంది.
ఇక ఎన్నికలకు ముందు ఏకంగా 70కి పైగా సీట్లలో ఎమ్మెల్యేలను మార్చడం కూడా దీనికి ఓ కారణంగా చెప్పొచ్చు. తమ స్థానంలో ఎవరినో తెచ్చిపెట్టి, గెలిపించాలని జగన్ ఆదేశించడం .. నేతలకు, క్యాడర్ కు సైతం నచ్చలేదు. ఈసారి సదరు వ్యక్తి గెలిస్తే.. తన స్థానం శాశ్వతంగా కోల్పోతామన్న సంగతి వారికి తెలియంది కాదు కదా..
ఇక అన్నింటికీ మించి వైఎస్ షర్మిల కొట్టిన దెబ్బ .. అది మామూలు దెబ్బకాదు. వైసీపీ కంచుకోట అయిన సీమలో భారీగా ఓట్లను చీల్చడంలో షర్మిల సక్సెసయ్యారు. ఇప్పుడు ఆపార్టీకి తగిన బలం, సీట్లు రాకపోవచ్చు. కానీ.. తర్వాతి ఎన్నికల్లో సీన్ ఇలాగే ఉంటే.. కాంగ్రెస్ పుంజుకోవడం ఖాయం. ఎందుకంటే గత ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి చాలా చోట్ల కాంగ్రెస్ కు ఓటుబ్యాంకు పెరిగిన సూచనలున్నాయి. మరీ ముఖ్యంగా వైఎస్ వివేకా హత్యకేసు.. వైసీపీ మెడకు ఉచ్చు బిగించింది. జనం కూడా ఆ విషయంలో వైసీపీ వాదనను విశ్వసించలేదని చెప్పాలి. అందుకే ఈతరహా ఫలితాలు ఆవిష్కృతమయ్యాయంటున్నారు విశ్లేషకులు.













