ఏయూ విద్యార్థినికి భారీ ఆఫర్..రూ.84.5 లక్షల వార్షిక వేతనంతో
ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిని రేపాక ఈశ్వరీ ప్రియ రూ.84.5 లక్షల వార్షిక వేతనంతో అట్లాషియన్ సంస్థలో ఉద్యోగం సాధించారు. కంప్యూటర్ సైన్స్ విభాగంలో మూడో సంవత్సరం చదువుతుండగానే భారీ వేతనంతో ఉద్యోగానికి ఎంపికైన ఈశ్వరీ ప్రియను ఏయూ వీసీ ప్రసాదరెడ్డి అభినందించారు. విశాఖ నగరానికి చెందిన ఈశ్వరీ ప్రియ తన ప్రతిభతో తొలుత మోర్గాన్‌స్టాన్లీ సంస్థలో ఇంటర్న్‌షిప్ సంపాదించింది. అక్కడ రూ.87 వేల స్టైపెండ్ అందుకుంది. అనంతరం అమెజాన్ సంస్థ నిర్వహించిన కోడిరగ్ పరీక్షలోనూ ప్రతిభ చూపి ఇంటర్న్‌షిప్‌కు ఎంపికయ్యింది. అక్కడ నెలకు రూ.1.4 లక్షలు అందుకుంటోంది. తాజాగా రూ.84.5 లక్షల భారీ వార్షిక వేతనంతో అట్లాషియన్ సంస్థలో ఉద్యోగం సంపాదించింది. దీనిపై ఈశ్వరీ ప్రియతో పాటు ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఏయూ ఇంజినీరింగ్ కళాశాల నుంచి 1,040 మందికి పైగా ఉద్యోగాలు సంపాదించారని ప్లేస్మెంట్ అధికారి మూర్తి తెలిపారు. త్వరలో మరిన్ని సంస్థలు నియామకాలు చేపట్టనున్నాయని, ప్రతి విద్యార్థికి ఉపాధి కల్పించే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.













