హైకోర్టులో చంద్రబాబుకు ఊరట..! సీఐడీ విచారణపై స్టే
అమరావతి భూవ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ విచారణపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్ర.. నారాయణ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి పాలకపక్షం కేసు పెట్టిందని వాదించారు. అరెస్టు సహా,తదుపరి చర్యలు చేపట్టకుండా నిలువరించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
అప్పటి గుంటూరు కలెక్టర్ విజ్ఞప్తితో జీవోను సవరించారని నారాయణ తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు. జీవోపై చర్చలు, విడుదల ప్రక్రియలో అప్పటి సీఎం, మంత్రి పాల్గొనలేదన్నారు. జీవో విడుదలయ్యాక మాత్రమే ఆమోదానికి పంపారని చెప్పారు. వ్యక్తిగతంగా వెళ్లి నష్టం కలిగిస్తే ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్లు వర్తిస్తాయన్నారు. జీవో ద్వారా లబ్ధిదారులకు ప్రయోజనం కల్పిస్తే కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. అప్పటి ప్రభుత్వం అన్ని వర్గాలకూ లబ్ధి చేకూర్చిందని దమ్మాలపాటి శ్రీనివాస్ ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
పిటిషన్‌దారుల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. విచారణపై నాలుగు వారాలు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు, నారాయణపై ఆధారాలు చూపించాలని సీఐడీ తరపు న్యాయవాదిని న్యాయమూర్తి అడిగారు. ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని సీఐడీ అధికారులకు ప్రశ్నించారు. అయితే.. విచారణ తొలి దశలో వివరాలు చెప్పలేమని సీఐడీ వివరించింది. పూర్తిస్థాయి విచారణకు అనుమతిస్తే అన్ని విషయాలు తెలుస్తాయని వెల్లడించింది. దీంతో.. కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి ఆదేశించింది. 4 వారాల పాటు స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అసైన్డ్ భూముల విక్రయం విషయంలో.. కొనుగోలుదారులకు లబ్ధి చేకూర్చేలా నాటి చంద్రబాబు సర్కారు వ్యవహరించిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గత నెలలో సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన సీఐడీ… మాజీ సీఎం చంద్రబాబుపై అట్రాసిటీ సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈ నెల 23న విచారణకు రావాలంటూ చంద్రబాబు నాయుడికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. దీంతో చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు… సీఐడీ విచారణపై నాలుగు వారాలు స్టే విధించింది.













