రెబల్స్ టెన్షన్
మొన్నటి వరకూ అధినేత మాటే శిలా శాసనం. అన్న చెప్పాడంటే అంతే.. తలొంచి, జగనన్న సైన్యం విధేయతతో మసలేది. లోలోపల అసంతృప్తి రగులుతున్నా… అణచిపెట్టుకుని ఉన్న పరిస్థితి. కాదంటే ఎక్కడ జగనన్నకు కోపం వస్తుందో భయం. ఎందుకంటే అన్న బొమ్మపైనే గెలుస్తున్న పరిస్థితి. జగన్ మానియా ఆస్థాయిలో ఉండడంతో… హైకమాండ్ చెప్పిందే వేదమైంది.అయితే ఇప్పుడు ఆపరిస్థితి కాస్త తిరగబడినట్లు కనిపిస్తోంది.
దాదాపు 50 స్థానాల్లో ఆధిపత్య పోరు కనిపిస్తోంది. రామచంద్రాపురం, గన్నవరం లాంటి స్థానాల్లో అయితే అది రోడ్డెక్కేసింది. రామచంద్రాపురం నియోజకవర్గంలో ఆది నుంచి కుటుంబానికి విధేయుడిగా ఉండి వస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, వేణు మధ్య రగడ కాస్తా తీవ్ర రూపు దాల్చింది. మంత్రి వేణుకు టికెటిస్తే .. నాదారి నేను చూసుకుంటానంటూ బెదిరించే స్థాయికి చేరింది. దాన్ని పరిష్కరిద్దామని తోట త్రిమూర్తులును పిలిపిస్తే.. ఆయన కూడా వేణుకు వ్యతిరేకంగా చిట్టా విప్పారు. దీంతో జగనన్నకు చెబుదామంటూ ఆ సమస్యను మిథున్ రెడ్డి… హైకమాండ్ మీద వదిలేసిన పరిస్థితి కనిపిస్తోంది.
దీనికి ఏమాత్రం తగ్గనట్లుగా ఉంది గన్నవరం పంచాయతీ. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి తానే పోటీ చేస్తున్నానని యార్లగడ్డ వెంకట్రావు ప్రకటించారు. నిజానికి ఇక్కడ కూడా టిక్కెట్ వంశీకేనని..జగన్ గతంలోనే చెప్పారు. కానీ యార్లగడ్డ వెంకట్రావు .. తాను పోటీ చేసి తీరతానంటున్నారు. ఇలా నందికొట్కూరు, నగరి, సత్తెనపల్లి ఇలా చెప్పుకుంటూ పోతే కనీసం యాభై నియోజకవర్గాల్లో వర్గ పోరు ఉందని వైఎస్ఆర్సపీ వర్గాలు చెబుతున్నాయి.
పిల్లి సుభాష్, చెల్లుబోయిన వేణుల మధ్య వ్యవహారం మీడియాకు ఎక్కడం.. గన్నవరం యార్లగడ్డ వెంకట్రావూ అదే పని చేయడంతో వైసీపీ అధినాయకత్వం అలర్ట్ అయింది. ఎవరైనా పార్టీ అంతర్గత వ్యవహారాలపై మీడియాతో మాట్లాడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు పంపింది. రాష్ట్రంలో గ్రూపిజం నడుస్తున్న పలు నియోజక వర్గాలపై కూడా అధిష్టానం సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఎక్క డెక్కడ సమస్య సున్నితంగా ఉందో అక్కడ ముందుగా ఒక నిర్ణయం తీసుకుని తేల్చేయాలని అనుకుంటోంది. ఇటీవల కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలను సస్పెండ్ చేయడం చేశారు.
ఇప్పటికే ఏఏ జిల్లాల్లో ఎవరెవరి మధ్య గ్రూపిజం నడుస్తుందన్న దానిపై పక్కా సమాచారాన్ని చేతిలో పట్టుకున్న పార్టీ ఆధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆచితూచి అడుగులేయాలని నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి, ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాస రెడ్డితో , ఎంపీ విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు. ఎంపీ విజయసాయి స్వయంగా బాలినేని ఇంటికి వెళ్లి గంటకుపైగా చర్చలు జరిపారు. అధిష్టానం చెప్పిన పలు అంశాలను ఆయనకు వివరించారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా గతంలో చేసిన రాజీనామాను ఉపసంహరించుకుని పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ కావాలని సూచించినట్లు తెలిసింది. ఇలా బుజ్జగించాల్సిన వాళ్లు ఎవరైనా ఉంటే.లిస్ట్ రెడీ చేసుకుని పార్టీ నాయకుల్ని వారి వద్దకు పంపుతున్నారు.













