వైసీపీని నిండా ముంచింది కోటరీనేనా..?
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం వైసీపీ శ్రేణులను కలచివేస్తోంది. కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కని స్థితి ఎందుకు దాపురించింది. ఇప్పుడిదే అంశం ఆపార్టీ శ్రేణులను వేధిస్తోంది. మరోవైపు.. పార్టీ ఓటమితో తాడేపల్లి ప్యాలెస్ వెలవెలబోయింది. గెలిచిన పదిమంది కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు కన్నెత్తి చూడడం లేదు. ఓడిన అభ్యర్థుల పరిస్థితి అయితే ఇంక చెప్పక్కర్లేదు. కోట్లు ఖర్చు పెట్టి దారుణంగా దెబ్బతిన్నామంటూ వారు వాపోతున్నారు. వై నాట్ 175 అన్నారని.. ఇప్పుడు పరిస్థితి చూస్తే దారుణంగా ఉందన్నారు వైసీపీ నేతలు. దీనంతటికీ అధ్యక్షుడు జగన్, ఆయన చుట్టూ ఉన్న కోటరీయే కారణమని ఆరోపిస్తున్నారు.
ఏపీలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత.. అనూహ్యమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఏమాత్రం విలువ లేకుండాపోయిందని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు… సర్వం.. తానే అన్నట్టుగా ఓ కీలక ఐఏఎస్ వ్యవహరించారని.. తెలుస్తోంది. ఆయన కారణంగానే ఎమ్మెల్యేలకు.. జగన్ దగ్గర కనీసం గోడు వెళ్లబోసుకునే అవకాశం కూడా చిక్కలేదని.. ఫలితంగా తమ తమ నియోజకవర్గాల్లో పనులు నిలిచిపోయి.. ప్రజల ఆగ్రహానికి ఇది కూడా ఒక కారణమై ఉంటుందని.. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు.
ఒక దరిద్రమైన అధికారి ఉన్నాడు. ఆయనే ధనుంజయరెడ్డి. ఎక్కడ నుంచో తెచ్చి.. ఇక్కడ పెట్టారు. ప్రతిదానికీ ఆయన తానే సర్వస్వం అన్నట్టుగా వ్యవహరించారు. ఎమ్మెల్యేలు ఏదైనా పనులపై ఆయన దగ్గరకు వెళ్తే.. గంటల తరబడి నిలబెట్టేవాడు. ముఖ్యమంత్రి ని కలిసేందుకు కూడా ఇబ్బంది పడేవాళ్లం. కనీసం కలిసినా.. చెప్పిన పనిని మళ్లీ ధనుంజయ రెడ్డికి అప్పగించేవారు. ఆయన చూద్దాం.. చేద్దాం.. అంటూ ఐదేళ్లు గడిపేశాడు అని రాజా వ్యాఖ్యానించారు.
మరోవైపు ఐప్యాక్ కూడా తమ కొంప ముంచిందంటున్నారు వైసీపీ నేతలు. ప్రతీపనిలో ఐప్యాక్ చేయి పెట్టిందని ఫలితంగా ఈఫలితాలు వచ్చాయని వాపోతున్నారు. ఐప్యాక్ రిజల్ట్స్ ను దగ్గర పెట్టుకుని తమను ప్రశ్నించారని.. ఇప్పుడా నిర్ణయాలే పార్టీ మెడకు ఉరితాడయ్యాయని ఆరోపిస్తున్నారు. మరీ ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయాలు లాంటి వ్యవస్థల్ని జగన్ ఏర్పాటు చేశారని.. ఫలితంగా తమ మాటకు ప్రజల్లో విలువ లేకుండా పోయిందంటున్నారు. కోటరీ మాటలు నమ్మి బలమైన నేతలను దూరం చేసుకోవడం, అభివృద్ధిని వదిలి సంక్షేమాన్ని మాత్రం నమ్ముకోవడమే ఈదుస్థితికి కారణమైనట్లు కనిపిస్తోందంటున్నారు మరికొందరు నేతలు.













