మౌనముద్రలో ముద్రగడ, రామజోగయ్య.. చప్పగా మారిన గోదావరి రాజకీయం..
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా నేతల మధ్య మాటలు యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు కాపు దిగ్గజాలు ఢీ అంటే ఢీ అంటూ ఒకరిపై ఒకరు వ్యంగ్యాస్త్రాలు విసురుకున్న విషయం అందరికీ తెలిసిందే. వారే మాజీ మంత్రులు.. కాపు సామాజిక వర్గ నేతలు చేగొండి హరి రామజోగయ్య, ముద్రగడ పద్మనాభం. ఇద్దరిలో ఒకరు పసుపు జెండాకు జై కొడితే మరొకరు ఫాన్ ఫీడ్ పెంచే పనిలో బిజీ అయ్యారు. నిన్నటి వరకు అలుపు లేకుండా పార్టీలకు సెల్ఫ్ మేడ్ బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరించిన ఈ ఇద్దరు నేతలు సడన్ గా సైలెంట్ అయ్యారు.
ఆంధ్రాలో పోలింగ్ పూర్తయి రెండు వారాలు దాటిన ఈ ఇద్దరిలో ఎవరూ పెదవి విప్పడం లేదు. ఇప్పటివరకు గెలుపు కూటమిది అని చేగొండి ప్రకటించలేదు.. పిఠాపురంలో పవన్ ఓటమి ఖాయం అని ముద్రగడ అనలేదు. ఎన్నికల ముందు వరకు ఏపీలో పీఠం వైసీపీ కే సొంతం అని కాన్ఫిడెంట్ గా చెప్పిన ముద్రగడ మూగనోము పట్టడం పెద్ద ప్రశ్నార్థకంగా మారుతోంది. పిఠాపురంలో పవన్ ఓటమిని బలంగా కోరుకున్న ముద్రగడ.. పోలింగ్ జరిగి ఇన్ని రోజులు పూర్తవుతున్న.. ఇప్పటివరకు పవన్ పై ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు.. వైసీపీ గెలుపు గురించి కూడా మాట్లాడలేదు.
ఇటు రామ జోగయ్య ఎన్నికల ముందు వరకు లేఖల ద్వారా తన సలహాలు సూచనలు కూటమికి అందిస్తూ వచ్చారు. పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో తన ఆలోచనలను సోషల్ మీడియా వేదికగా ఎన్నో సందర్భాలలో వెల్లడించారు. మరి పోలింగ్ ఫలితాలు ఆయనకు అనుకూలంగా వచ్చాయా.. కూటమి గెలుస్తుందా అన్న విషయంపై పోలింగ్ తర్వాత ఆయన విశ్లేషణ ఇస్తారు అని ఆశించిన అందరూ నిరాశ చెందారు. ఇటు ముద్రగడ మౌనం వైసీపీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. అటు ముద్రగడ ఇటు రామ జోగయ్య.. ఈ రాజకీయ దిగ్గజాలు ఇద్దరూ మౌనముద్రలో ఉండడం వెనుక కారణాలు ఏమిటో ఎవరికి తెలియదు. అప్పుడే మాట్లాడటం ఎందుకు అనుకున్నారో.. లేక మరేదైనా కొత్త వ్యూహాలకు సమయం తీసుకున్నారు తెలియదు కానీ.. మొత్తానికి మౌనం వీడి వీరు ఎప్పుడు మాట్లాడతారా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ ఇద్దరి వాదోపవాదాలు లేక గోదావరి రాజకీయం ఉప్పులేని పప్పులా చప్పబడిపోయింది.













