Peace Proposal: ఆపరేషన్ కగార్(kagar) ఆపండి.. శాంతిచర్చలకు సిద్ధమన్న మావోయిస్టులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘ఆపరేషన్ కగార్’ పేరుతో కొనసాగిస్తున్న నరమేధాన్ని నిలిపివేస్తే.. శాంతిచర్చలకు, కాల్పుల విరమణకు తాము సిద్ధంగా ఉన్నామని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ప్రకటించింది. చత్తీస్ గఢ్, మహారాష్ట్ర (గడ్చిరోలి), ఒడిశా, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చేస్తున్న హత్యాకాండలను నిలిపివేయాలని, బస్తర్‌లోని సాయుధ బలగాలను బ్యారక్‌లకే పరిమితం చేయాలని, కొత్త క్యాంపుల ఏర్పాటును ఆపాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట గత నెల 28వ తేదీన విడుదల చేసిన బహిరంగ ప్రకటన బుధవారం వెలుగులోకి వచ్చింది.
మార్చి 24వ తేదీన హైదరాబాద్‌లో ‘కేంద్ర ప్రభుత్వం- మావోయిస్టు పార్టీ బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించి శాంతిచర్చలు జరపాలి’ అన్న అంశంపై ‘శాంతిచర్చల కమిటీ’ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశాన్ని స్వాగతిస్తున్నామని అభయ్ పేర్కొన్నారు. శాంతి చర్చలకు తాము తొలి నుంచీ సిద్ధంగా ఉన్నామన్నారు. ‘గత ఏడాది జనవరిలో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు బీజేపీ ప్రభుత్వం, విప్లవోద్యమం ఉనికిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆపరేషన్ కగార్ పేరిట ప్రజలపై ప్రతీఘాతక యుద్ధాన్ని ప్రారంభించాయి. ప్రజలను మోసగించడానికి ఛత్తీస్ గఢ్ హోంమంత్రి విజయ్‌శర్మ.. మావోయిస్టులతో చర్చలకు సిద్ధమని ప్రకటించారు. దీనిపై మా పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మీడియా ప్రతినిధి వికల్ప్ స్పందిస్తూ.. చర్చలకు తాము కూడా సిద్ధమని రెండుసార్లు తెలిపారు. కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. పైగా, గత 15 నెలలుగా కగార్ పేరిట ఆదివాసీలపై, ప్రజలపై యుద్ధం చేస్తున్నాయి’ అని అభయ్ వివరించారు. చత్తీసగడ్లో జరుపుతున్న నరమేధం కారణంగా.. ఇప్పటివరకూ మావోయిస్టు పార్టీకి చెందిన 400 మందికి పైగా వివిధ స్థాయిల నాయకులు, కార్యకర్తలు, సభ్యులు హత్యకు గురయ్యాయరని తెలిపారు. వీరిలో మూడొంతుల మంది ఆదివాసీలేనన్నారు. తమ పార్టీకి చెందిన వేలాదిమందిని అరెస్టు చేశాన్నారు.
‘కార్డన్ అండ్ కిల్’ (చుట్టుముట్టడం, చంపివేయటం) అనే పద్ధతి ప్రకారం మారణహోమం జరుపుతున్నారని, పట్టుబడిన వారిని అత్యంత అమానుష పద్ధతుల్లో చిత్రహింసలు పెట్టి చంపుతున్నారని, మహిళా కామ్రేడ్స్‌పై సామూహిక అత్యాచారాలు జరిపి హత్య చేస్తున్నారని అభయ్ ఆరోపించారు. అందుకే ఈ యుద్ధాన్ని తాము నరమేధంగా చెబుతున్నామన్నారు. ఈ యుద్ధంలో భద్రతా బలగాలు పాల్గొంటున్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. వాస్తవానికి భారతసైన్యాన్ని మోహరించారని తెలిపారు. ఆ పోరాటాన్ని అణచివేసి.. భూమిని, ప్రకృతి వనరులను కార్పొరేట్ కంపెనీల అధిపతులకు కట్టబెట్టటం కోసం ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ జరుపుతున్నాయని పేర్కొన్నారు.












