కన్నా ఎఫెక్ట్..! టీడీపీకి రాయపాటి గుడ్ బై..!?
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికలకు ఇంకో తొమ్మిది నెలలు మాత్రమే సమయం ఉంది. దీంతో నేతలందరూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమకు అనువైన స్థానమేదో… ఏ పార్టీలో తమకు టికెట్ దక్కే అవకాశం ఉందో వెతుక్కుంటున్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీలో టికెట్ వచ్చే పరిస్థితి లేకపోతే ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా నేతల అడుగులు ఉంటున్నాయి. ఇప్పటి నుంచే సేఫ్ జోన్ కోసం ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో రాజకీయాలు ఇంట్రస్టింగ్ గా మారుతున్నాయి. కీలక నేతగా ఉన్న కన్నా లక్ష్మినారాయణ టీడీపీలో చేరి సంచలనం సృష్టించారు. క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు అడుగులు ఎలా ఉంటాయనేది ఆసక్తి రేపుతోంది.
గుంటూరు జిల్లాలో రాయపాటి సాంబశివరావు, కన్నా లక్ష్మినారాయణ సీనియర్ నేతలుగా ఉంటున్నారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర వారిద్దరి సొంతం. కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగారు. అయితే వాళ్లిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఎప్పటి నుంచో నడుస్తోంది. దీంతో సొంత పార్టీలో ఉన్నా కూడా వాళ్లిద్దరి మద్య గ్యాప్ అలాగే ఉండేది. రాష్ట్ర విభజన ముందు వరకూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్లిద్దరూ ఆ తర్వాత పార్టీలు మారారు. కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేకపోవడంతో రాయపాటి సాంబశివరావు టీడీపీలో చేరి 2014లో ఎంపీగా గెలిచారు. 2019లో ఓడిపోయినా టీడీపీలోనే కొనసాగుతున్నారు. కన్నా లక్ష్మినారాయణ బీజేపీలో చేరారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పని చేసిన కన్నా.. ఇటీవల ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి టీడీపీలో చేరారు.
ఒకప్పుడు బద్ధ శతృవులుగా ఉన్న ఇద్దరు నేతలు.. ఇప్పుడు మళ్లీ ఒకే గూటికి చేరారు. దీంతో వాళ్లిద్దరి మధ్య ఆధిపత్య పోరు మళ్లీ ప్రారంభమైంది. కన్నా లక్ష్మినారాయణ రాకను పైకి స్వాగతిస్తున్నా.. లోపల మాత్రం రాయపాటి కుటుంబం వ్యతిరేకిస్తోంది. అయితే ఎవరికీ అన్యాయం చేయనని చంద్రబాబు మాటివ్వడంతో రాయపాటి శాంతించారు. కన్నా లక్ష్మినారాయణను గుంటూరు వదిలి సత్తెనపల్లి నుంచి పోటీ చేయించేందుకు ఒప్పించారు. దీంతో కన్నా లక్ష్మినారాయణ సత్తెనపల్లిలో మకాం వేసి తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. అయితే రాయపాటి సాంబశివరావు మాత్రం కన్నాకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని సహించలేకపోతున్నట్టు సమాచారం. అందుకే ఆయన పార్టీ మారాలనుకుంటున్నట్టు టాక్ నడుస్తోంది.
రాయపాటి సాంబశివరావు గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. అలాగే ఆయన కుమారుడికి అసెంబ్లీ సీటు ఆశిస్తున్నారు. టీడీపీలో అది సాధ్యం కాదనే విషయం అర్థమైంది. గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి మరోసారి గల్లా జయదేవ్ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. రాయపాటి కుటుంబానికి ఒక అసెంబ్లీ సీటు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. అయితే తమకు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కావాల్సిందేనని రాయపాటి పట్టుబడుతున్నారు. అందుకే వైసీపీలో తమకు ఆ హామీ లభిస్తే టీడీపీకి గుడ్ బై చెప్పేసి ఫ్యాన్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే అంబటి రాయుడు గుంటూరు పార్లమెంటు నుంచి పోటీ చేస్తారనే టాక్ నడుస్తోంది. ఇలాంటి సమయంలో రాయపాటి ఏం చేస్తారనేది ఆసక్తి రేపుతోంది.













