చొక్కాపు వెంకటరమణకు రామినేని పురస్కారం
బాల సాహిత్య వికాసానికి, బాలల ప్రతిభా ప్రోత్సాహానికి నాలుగు దశాబ్దాలుగా విశేష కృషి చేస్తున్న బాల సాహిత్య రచయిత, ఇంద్రజాలికుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు చొక్కాపు వెంకటరమణకు ప్రతిష్టాత్మకమైన డాక్టర్ రామినేని ఫౌండేషన్ విశేష పురస్కారం-2018 ప్రదానం చేయనున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ ధర్మప్రచారక్ రామినేని తెలియజేసినట్లు బాల సాహిత్య పరిషత్ ప్రధాన కార్యదర్శి దాసరి వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు.
అక్టోబర్ 7వ తేదీన విజయవాడ సీకే కన్వెన్సన్‌లో జరిగే కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా రూ.లక్ష నగదు పురస్కారంతో పాటు జ్ఞాపికను అందజేసి సత్కరిస్తామన్నారు. బాలచంద్రిక పిల్లల పత్రికకు 18 ఏళ్లు సంపాదకులుగా పనిచేసిన చొక్కాపు చిన్నారుల కోసం 70 పుస్తకాలు రాశారు. 2015లో కేంద్ర సాహిత్య అకాడమి బాలసాహిత్య పురస్కారం అందుకున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారంతో గౌరవించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాషా విశిష్ట పురస్కారం -2018తో సత్కరించింది. ఇదే వేదికపై బ్యాడ్మింటన్ ఛాంపియన్ డాక్టర్ పుల్లెల గోపీచంద్‌కు విశిష్ట పురస్కారం, మహా సహాసవ్రధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు, మహానటి సినీ దర్శకుడు నాగ్ అశ్విన్రెడ్డికి విశేష పురస్కారాలను అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.













