ఆలయాలను పరిరక్షించే బాధ్యత సీఎంకు లేదా?
దేవుడి సేవకంటే పవిత్రమైన పని మరొకటి లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. విజయనగరం జిల్లాలోని రామతీర్థం విగ్రహం ధ్వంసమైన బోడికొండ ప్రదేశాన్ని చంద్రబాబు పరిశీలించారు. రాముడి శిరస్సును ధ్వంసం చేసి పడేసిన కోనేరును పరిశీలించారు. విగ్రహం ధ్వంసంపై అక్కడి పూజారులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఉత్తరాంధ్ర అయోధ్యగా కొలుస్తున్న రామతీర్థంలో విగ్రహం ధ్వంసం చేయడం ద్వారా కోదండరాముడికి అవమానం జరిగిందన్నారు. వైకాపా పాలనలో దేవాలయాలపై దాడులు జరగడం అత్యంత దారుణమన్నారు. విగ్రహాల ధ్వంసంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
వైకాపా పాలనలో రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ కుళ్లిపోయాయి. టీడీపీ హయాంలో ప్రార్థనా మందిరాలపై ఎలాంటి దాడులు జరగలేదు. ఆలయాలను పరిరక్షించే బాధ్యత సీఎం జగన్‌కు లేదా? రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారనని తెలిసి అందరూ బాధపడ్డారు. విగ్రహాలను ధ్వంసం చేసేవారు పరమ కిరాతకులు. కొందరు పోలీసులు కూడా అతిగా ప్రవర్తిస్తున్నారు. రామతీర్థంలో ఎంపీ విజయసాయిరెడ్డికి ఏం పని? ఇలాంటి చోటామోటా నాయకులను నా రాజకీయ జీవితంలో చాలా మందిని చూశాను అని వ్యాఖ్యానించారు. రామతీర్థం ఘటనపై ఆర్డీవో, తహసీల్దార్‌కు బాధ్యత లేదా? విగ్రహాల ధ్వంసం విషయంలో తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై తర్వాత చర్యలు తప్పవు. దేవుడిని చూసేందుకు ఎంపీ విజయసాయిరెడ్డిని ఆనుమతించారు. మరి నన్నెందుకు అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రయత్నించారు అని ప్రశ్నించారు.













