వర్మ వర్సెస్ టీడీపీ…
డైరెక్టర్ వర్మ వ్యూహం సినిమా నిర్మాణదశలోనే వివాదాలకు దారితీస్తోంది. తన సినిమాకు ప్రచారం కల్పించాలనేమో తెలియదు కానీ… వర్మ.. టీడీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకుని విమర్శలకు దిగుతున్నారు. ట్విట్టర్ లో సెటైర్లు వేస్తున్నారు. దీనికి టీడీపీ నేతల నుంచి సైతం అంతే ధీటుగా కౌంటర్స్ పడుతున్నాయి. వర్మను వైసీపీ కండువా కప్పుకోని కార్యకర్తగా టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. గతంలో వైఎస్సార్ జీవిత చరిత్రపై వర్మ తీసిన సినిమా.. ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. అయితే అప్పట్లో అందరూ వర్మ… ఓ డైరెక్టర్ గా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడని భావించి, సినిమాను ఆదరించారు. అయితే ఇప్పుడు మాత్రం ఆపరిస్థితి కనిపించడం లేదన్నది టాక్. ఎందుకంటే.. వర్మ సైతం వైసీపీ అభిమానినంటూ ఓపెనయ్యారు మరి.
వైసీపీ కోసం వర్మ తెరకెక్కిస్తున్న మూవీ వ్యూహం షూటింగ్ విజయవాడలో జరుగుతోంది. ఇబ్రహీం పట్నంలోని పవిత్ర సంగమం దగ్గర వ్యూహం సినిమా చిత్రీకరించడంపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్జీవీకి దమ్ముంటే టీడీపీ హయాంలో నిర్మించిన ఇరిగేషన్ ప్రాజెక్టులపై సినిమా తీయాలని సవాల్ విసిరారు. అంతేకాదు.. పట్టిసీమ దండగ అంటూ ప్రచారం చేసిన వైసీపీ నాయకులు.. ఏ మొహం పెట్టుకుని దానివైపు చూస్తున్నారని కూడా దేవినేని ప్రశ్నించారు. ‘ఆర్జీవీ ఓ దగుల్బాజీ, దుర్మార్గుడు.. బుద్ధి జ్ఞానం, ఏమైనా ఉందా..’ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఉమ విమర్శలకు ఆర్జీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. మిక్కీమౌస్ బొమ్మతో నిలబడ్డ ఫొటోను ట్వీట్ చేసిన ఆర్జీవీ.. దేవినేని ఉమాను ట్యాగ్ చేస్తూ ‘ఉమ్మా……..’ అని ట్వీట్ చేశారు. అక్కడితో ఆగకుండా చివర్లో ఓ కిస్ ఎమోజీని పెట్టాడు. ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. దీనిపై వందలాది మంది అభిమానులు రియాక్ట్ అయ్యారు. టీడీపీ కార్యకర్తలు, దేవినేని వీరాభిమానులు వర్మపై తిట్లపురాణం మొదలెట్టేశారు.
దీంతో ఉమ.. మరోసారి ట్విట్టర్‌కు పనిచెప్పారు. బురదలో ఉన్న పంది బొమ్మను చూపిస్తూ పందిపై RGV అని పోస్ట్ చేశారు. అంతేకాదు.. ‘హాయ్ రాంగోపాల్ కర్మయ’ అంటూ ఉమ పోస్ట్ చేశారు. నిన్న మొన్నటి వరకూ ఉత్తరాంధ్రకు చెందిన బండారు సత్యనారాయణపై వర్మ విమర్శలు గుప్పిస్తూ వరుస ట్వీట్లు చేశారు. అదేస్థాయిలో టీడీపీ నుంచి దిమ్మతిరిగే కౌంటర్ కూడా వచ్చింది. ఇప్పుడు ఉమా తన గురించి మాట్లాడటంతో ఇలా రియాక్ట్ అవ్వడం.. దీనికి మళ్లీ కౌంటర్ రావడంతో అటు టాలీవుడ్లో.. ఇటు ఏపీ రాజకీయాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి చూస్తే.. ఇప్పుడు ఆర్జీవీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా పరిస్థితి మారిందని చెప్పుకోవచ్చు.













