ఆర్జీవీ మరీ ఓవరాక్షన్ చేస్తున్నట్టు లేదూ…!?
రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు. సినిమాని టెక్నికల్ గా ఓ రేంజ్ కి తీసుకెళ్లిన దర్శక ధీరుడు. రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేయాలని.. ఆయనంత ఎత్తుకు ఎదగాలని ఎంతోమంది తపించారు. అయితే ఇప్పుడు ఆయన్ను సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక వింత జీవిగా చూస్తోంది. ఈయనేనా ఒకప్పుడు అగ్రదర్శకుడు.. దేశం మొత్తం ఎదురు చూసిన దర్శకుడు అని ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోతోంది. ఇండస్ట్రీ మాత్రమే కాదు.. సామాన్య సినీ ప్రేమికులు కూడా ఆర్జీవీని చూసి జాలి పడుతున్నారు. ఇంతకూ ఆర్జీవీ ఇప్పుడు ఏం చేస్తున్నారు..? ఎందుకింత దిగజారిపోయారు..?
రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ లాంటి వారిని హీరోగా పెట్టి సినిమాలు తీశాడు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించాడు. మిగిలిన దర్శకులంతా మూస ధోరణలో వెళ్తుంటే ట్రెండ్ బెండ్ తీశాడు రామ్ గోపాల్ వర్మ. కానీ అదంతా గతం. దాదాపు పదేళ్లుగా రామ్ గోపాల్ వర్మకు చెప్పుకో దగ్గ సినిమాలు లేవు. ఒకప్పుడు ఆయన సినిమా రిలీజ్ అవుతోందంటే కోట్లాది మంది ఎదురు చూసేవాళ్లు. కానీ ఇప్పుడు ఆయన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతోందో.. ఎక్కడ రిలీజ్ అవుతోందో కూడా అర్థం కాని పరిస్థితి. తీస్తున్నవి కూడా సీ గ్రేడ్ సినిమాలే. అంగాంగ ప్రద్శనలు, కుళ్లు జోకులు, రొమాంటిక్ పేరుతో వెగటు పుట్టించే దృశ్యాలు.. ఇవీ రామ్ గోపాల్ వర్మ కథాంశాలు ఇప్పుడు.
సినిమాల్లో పూర్తిగా ఫెయిల్ అయిపోవడంతో ఆర్జీవీ తనను తాను ఎలివేట్ చేసుకునేందుకు రాజకీయాలపై పడ్డాడనిపిస్తోంది. అందుకే నిత్యం ఏదో ఒక పొలిటికల్ ట్వీట్ తో వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో వైసీపీకి అనుకూలంగా, టీడీపీ – జనసేన కూటమికి వ్యతిరేకంగా రామ్ గోపాల్ వర్మ పెద్ద యుద్ధమే చేస్తున్నారు. వైసీపీ కంటే ముందే టీడీపీ, జనసేనలపై ఆర్జీవీ సెటైర్లు వేస్తున్నారు. టీడీపీ – జనసేనతో ఆర్జీవీయే రాజకీయంగా తలపడుతున్నారేమో అనిపిస్తుంటుంది అప్పుడప్డుడు. అంతగా ఒంటినిండా రాజకీయాలు నింపేసుకున్నాడు ఆర్జీవీ.
టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన పాట్లేవో ఆయన పడుతున్నారు. అలాంటిది ఇవాళ ఆర్జీవీ రాజమండ్రి వెళ్లి సెంట్రల్ జైలు ఎదుట నిలబడి ఒక సెల్ఫీ తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆయన లోపల.. నేను బయట.. అని క్యాప్షన్ పెట్టి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అసలు రామ్ గోపాల్ వర్మకు ఏమైనా అవసరం ఉందా ఇలా చేయడానికి? వైసీపీ ప్రత్యర్థి పార్టీ కాబట్టి అలాంటి పనులు చేస్తే అర్థముంటుంది.. కానీ ఆర్జీవీ ఇలా ఎందుకు చేసినట్టు? ఎవరికీ అర్థం కాదు.. కానీ ఆర్జీవీకి మాత్రం క్లారిటీ ఉంటుంది.. అందుకే ఆర్జీవీని పెయిడ్ ఆర్టిస్ట్ అని పిలుస్తుంటారు టీడీపీ నేతలు. మరి అలా అయినా పేమెంట్ అందుతుంటే మంచిదేగా..! సినిమాల్లో డబ్బులు రానప్పుడు కనీసం ఇలాగైనా వస్తే సంతోషమేగా..!!?













