ఇటు చంద్రబాబు.. అటు జగన్.. కన్ఫ్యూజన్ లో రాజశ్యామలా దేవి..
మనం మన కష్టాలు తీర్చమని దేవుళ్లకు మొక్కడం పొరపాటు. దేవుళ్లకు ఎటువంటి వివక్ష పక్షపాతం ఉండవు.. అయితే ప్రస్తుతం పోటా పోటీగా మొక్కలు మొక్కి, యాగాలు చేసి దేవుళ్లను సైతం కన్ఫ్యూజన్ లో పడేస్తున్నారు ఆంధ్ర నాయకులు. ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు నానాటికి ఎక్కువగా మారుతుంది. ఎవరి సత్తా వారికి ఉన్నట్లే.. ఎవరి వీక్ పాయింట్స్ వాళ్లకి ఉన్నాయి. కానీ అవేమీ పట్టనట్టుగా తమకు తామే ఈసారి ఎలక్షన్స్ గెలుస్తాము అన్న ధీమా వ్యక్తం చేస్తూ ముందుకు సాగుతున్నాయి ఈ రెండు పార్టీలు.
రెండు పార్టీల నేతల టార్గెట్ ఒకటే.. సీఎం కుర్చీ. దాన్ని కైవసం చేసుకోవడం కోసం పట్టుదలగా ఇద్దరు కనిపించిన ప్రతి మార్గాన్ని అవలంబిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెంటిమెంట్లకు కమిట్ అవ్వడమే కాకుండా దేవుళ్ళకి భారీ భారీ మొక్కులు మొక్కి యజ్ఞ యాగాదులు చేస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు రాజశ్యామల అమ్మవారి యాగం చేశారు జగన్. త్యాగం చేయడం వల్లే అతను 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాడు అన్న ప్రచారం జోరుగా సాగింది. ఈసారి అమ్మవారిని తన వైపు లాక్కోవాలి అనే ఆశతో చంద్రబాబు కూడా రాజశ్యామల అమ్మవారి యాగం చేయించారు.
గతవారం చంద్రబాబు ఉండవల్లి నివాసంలో మూడు రోజులపాటు రాజశ్యామల యాగం నిర్వహించడం జరిగింది. ఇటు జగన్ కూడా తాడేపల్లి నుంచి విశాఖ చేరుకొని పెందుర్తి లోని శారదా పీఠానికి రాజశ్యామల అమ్మవారి ఆశీస్సుల కోసం వెళ్లారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించడంతోపాటు పూర్ణాహుతి కార్యక్రమంలో కూడా పాలుపంచుకున్నారు. శారదాపీఠంలో గత వారం రోజులుగా వార్షికోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే రాజశ్యామల అమ్మవారి యాగం కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో త్యాగఫలం పూర్తిగా దక్కించేటటువంటి పూర్ణాహుతి కార్యక్రమానికి జగన్ హాజరయ్యారు
తెలంగాణ ఎన్నికల టైం లో అటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఈ యాగాన్ని నిర్వహించారు. అయితే అనూహ్యంగా ఈసారి అమ్మవారి కరుణ రేవంత్ రెడ్డి మీద ఉండడంతో ఆయన సీఎం అయ్యారు అని టాక్. దీంతో ఇటు చంద్రబాబు సీఎం పదవి కోసం రాజశ్యామల యాగం చేయించారు.. అటు జగనన్న ఈసారి కూడా అధికారాన్ని కోరుకుంటూ అమ్మవారి దీవెనల కోసం పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడు అమ్మవారిని ఇద్దరూ కలిసి కన్ఫ్యూజన్ లో పడేశారు. మరి రాజశ్యామల అమ్మ ఎవరికి రాజయోగం కలిగిస్తుందో ఎన్నికల ఫలితాలు వచ్చాక తేలుతుంది.













