Raj Kasireddy : రేపు సిట్ విచారణకు వస్తున్నా..! రాజ్ కసిరెడ్డి ఆడియో సందేశం..!!

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) పాలనలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్యం కుంభకోణం (Liquor Scam) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి (Raj Kasireddy ) రేపు (మంగళవారం) స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) కార్యాలయంలో విచారణకు హాజరవుతానని ప్రకటించారు. ఇన్నాళ్లూ ముందస్తు బెయిల్ కోసం వేచి చూసిన రాజ్ కసిరెడ్డి.. ఇప్పుడు అనూహ్యంగా సిట్ ముందు హాజరవుతానని ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. ఈ కేసులో విజయసాయి రెడ్డి (Vijayasai Reddy), మిథున్ రెడ్డి (Mithun Reddy) ఇప్పటికే సిట్ ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు.
APSBCL ఆధ్వర్యంలో 2019-2024 మధ్య మద్యం వ్యాపారంలో భారీ అక్రమాలు జరిగినట్లు టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ నాయకులు కొందరు మద్యం తయారీ సంస్థలతో లింకులు కలిగి ఉన్నారని, స్థానిక బ్రాండ్లను ప్రోత్సహించి, నగదు లావాదేవీల ద్వారా అక్రమంగా డబ్బు సంపాదించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం నిగ్గు తేల్చేందుకు గతేడాది ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. లోతైన విచారణ చేపట్టింది. ఈ కేసు దాదాపు రూ. 18,860 కోట్ల నష్టాన్ని రాష్ట్ర ఖజానాకు కలిగించినట్లు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు (Lavu Srikrishnadevarayalu) లోక్ సభలో ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వంలో రాజ్ కసిరెడ్డి ఐటీ సలహాదారుగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన పలు కంపెనీలు స్థాపించి, వాటి ద్వారా అక్రమ లావాదేవీలు జరిపినట్లు సిట్ గుర్తించింది. హైదరాబాద్‌లోని ఆయన నివాసం, కార్యాలయాలపై ఏప్రిల్ 15 నుంచి సిట్ దాడులు నిర్వహించింది. ఆర్థిక లావాదేవీలు, రికార్డులను సిట్ పరిశీలించింది. గతంలో నాలుగుసార్లు సిట్ నోటీసులు జారీ చేసినప్పటికీ, కసిరెడ్డి విచారణకు హాజరు కాలేదు. ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డిని కూడా సిట్ విచారించింది.
ఈ కేసులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏప్రిల్ 18న సిట్ విచారణకు హాజరై, కసిరెడ్డినే కుంభకోణం వెనుక ప్రధాన సూత్రధారిగా పేర్కొన్నారు. మద్యం విధానంపై చర్చల కోసం హైదరాబాద్, విజయవాడలో జరిగిన సమావేశాల్లో కసిరెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి పాల్గొన్నట్లు ఆయన వెల్లడించారు. అయితే, కిక్‌బ్యాక్‌లు, డబ్బు లావాదేవీల గురించి తనకు తెలియదని విజయసాయి స్పష్టం చేశారు. వ్యాపారం చేసుకుంటామంటో అరబిందో ఫార్మా నుంచి తాను రూ.100 కోట్ల రుణం ఇప్పించానన్నారు. కొత్త డిస్టిలరీల గురించి కసిరెడ్డి మాత్రమే వివరాలు చెప్పగలరని ఆయన అన్నారు.
మరోవైపు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఏప్రిల్ 19న సిట్ విచారణకు హాజరయ్యారు. దాదాపు 8 గంటలపాటు ఆయన్ను సిట్ ప్రశ్నించింది. విజయసాయి రెడ్డి ఇచ్చిన రుణాలు, కసిరెడ్డితో సంబంధాలను ఆయన ఖండించారు. మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసారు. బెయిల్ మంజూరు కానప్పటికీ ఈ నెల 28 వరకూ ఆయన్ను అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు వెసులుబాటు ఇచ్చింది. ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి బెయిల్ పిటిషన్ ఏపీ హైకోర్టులో ఉంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. దీంతో సిట్ ముందు హాజరవ్వాలని కసిరెడ్డి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. విజయసాయి రెడ్డి గురించి సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలూ చెప్తానని రాజ్ కసిరెడ్డి ఆడియోలో చెప్పారు. ఆయన విజయసాయిపై ఏం చెప్తారనేది ఆసక్తి రేపుతోంది.