Raj Kasireddy: పోలీసుల షాకింగ్ రియాక్షన్.. రాజ్ కసిరెడ్డి అరెస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన లిక్కర్ కుంభకోణం (AP Liquor Scam) కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డిని (Raj Kasireddy) ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి, సిట్ విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటూ వచ్చారు. హైకోర్టు బెయిల్ పిటిషన్ (bail petition) పై విచారణను వచ్చే వారానికి వాయిదా వేయడంతో రేపు విచారణకు వస్తున్నట్టు రాజ్ కసిరెడ్డి ఆడియో మెసేజ్ (audio message) పంపించారు. ఇందుకోసం దుబాయ్ (Dubai) నుంచి హైదరాబాద్‌కు (Hyderabad) చేరుకున్న ఆయనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో (Samshabad Airport) సిట్ (SIT) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్‌తో ఈ కేసు కొత్త మలుపు తీసుకుంది.
2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్ కసిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారుగా నియమితులయ్యారు. ఈ సమయంలో రాష్ట్రంలో మద్యం వ్యాపారంలో అక్రమాలు జరిగాయని, వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. మద్యం షాపుల సరఫరా, లైసెన్సులు, కమీషన్ల వసూళ్లలో రాజ్ కసిరెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ గుర్తించింది. ఈ కుంభకోణంలో సుమారు 3వేల కోట్లకు పైగా అవకతవకలు జరిగినట్లు అంచనా. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. రాజ్ కసిరెడ్డిని విచారణకు హాజరు కావాలని మూడు సార్లు నోటీసులు జారీ చేసింది. అయితే తనకు ఈ కేసుతో సంబంధం లేదని, నోటీసులకు చట్టబద్ధత లేదని వాదిస్తూ హైకోర్టును ఆశ్రయించారు.
అరెస్టు భయంతో రాజ్ కసిరెడ్డి ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని, తాను ఐటీ సలహాదారుగా మాత్రమే పనిచేశానని, మద్యం వ్యవహారంతో సంబంధం లేదని వాదించారు. సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. కానీ హైకోర్టు తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. దీంతో రాజ్ కసిరెడ్డి సిట్ విచారణకు హాజరవుతానని సోమవారం మధ్యాహ్నం ఆడియో సందేశం విడుదల చేశారు. రాజ్ కసిరెడ్డి దుబాయ్ నుంచి వస్తున్నట్టు సమాచారం అందడంతో సిట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయన ఇండిగో విమానంలో రాజేష్ రెడ్డి అనే మారుపేరుతో హైదరాబాద్‌కు వస్తున్నట్లు గుర్తించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కాపుకాసిన సిట్ బృందం ఆయనను అదుపులోకి తీసుకుంది. అనంతరం విజయవాడకు తరలించింది.
రాజ్ కసిరెడ్డిని విజయవాడకు తరలించిన సిట్, ఆయన్ను విచారించి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అదే జరిగితే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కు కాలం చెల్లినట్లే. ఒకవేళ కోర్టు రిమాండ్ విధిస్తే బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈలోపు విచారణలో కీలక విషయాలు బయటికొస్తే కేసు మరో మలుపు తీసుకునే అవకాశం ఉంది.