ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు
ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ న్నారు. గుంటూరులో ఏర్పాటుచేసిన ఎపి ప్రత్యేక హోదా భరోసా సభలో ఆయన ప్రసంగించారు. 2019లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు తాము తీసుకోబోయే తొలి నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడమేనన్నారు. రాష్ట్రాన్ని విభజించినప్పుడే నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారని రాహుల్ గుర్తు చేశారు. అయితే, ఎన్డీయే ప్రభుత్వం ఆ హామీని వాయిదా వేసిందన్నారు. హోదాతో రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని, అలాంటి హక్కును సాధించుకొనేందుకు ఇక్కడి అధికార, ప్రతి పక్ష పార్టీ ఎందుకు పోరాడటంలేదని ప్రశ్నించారు.
హోదాతో కేంద్రం నుంచి వచ్చే నిధులు, చంద్రబాబు, జగన్‌లకు ఎందుకు అవసరం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో తిరుపతిలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక హోదాపై ఇచ్చిన వాగ్ధానం ఏమైందని ప్రశ్నించారు. దేవుడి స్థలంలో పదేళ్ల హోదా ఇస్తామని హామీ ఇచ్చారని, మరి ఆ హామీని ఎందుకు నెరవేర్చడం లేదని నిలదీశారు. హిందూ ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడే ప్రధాని నరేంద్ర మోడీ తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని విస్మరించారన్నారు. ప్రత్యేక హోదా వద్దనడానికి ఆంధ్రప్రదేశ్‌లోని అధికార, ప్రతిపక్షాలకు ఉన్న ప్రత్యేక ప్యాకేజీయే కారణమని ఆరోపించారు. మోడీ అంటే అధికార, ప్రతిపక్ష పార్టీలకు భయం పట్టుకుందని, ఆ భయంతోనే హోదాకోసం పోరాడటం లేదన్నారు. జగన్, చంద్రబాబు పోరాటం చేయక పోయినా, కాంగ్రెస్ ప్రజల పక్షాన నిలబడి హోదా సాథనకు పోరాటం చేస్తుందన్నారు.













