లోక్‍సభ స్పీకర్ తో భేటీ అయిన… రాఘురామ కుటుంబ సభ్యులు

లోక్‍సభ స్పీకర్ ఓం బిర్లాను ఎంపీ రఘురామ కృష్ణరాజు కుటుంబ సభ్యులు కలిశారు. రఘురామ సతీమణి రమాదేవి, కుమారుడు భరత్, కుమార్తె ఇందూ ప్రియదర్శిని స్పీకర్‍తో భేటీ అయ్యారు. రఘురామకృష్ణరాజును జగన్ ప్రభుత్వం వేధిస్తోందని వారు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. పార్లమెంట్ సభ్యునిగా ఉన్న ఒక వ్యక్తిని అరెస్టు చేసేముందు స్పీకర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని, అయితే ఎలాంటి అనుమతి తీసుకోకుండా రఘురామను అరెస్టు చేశారన్నారు. సీఐడీ కస్టడీలో ఉన్న ఆయనను చిత్రహింసలకు గురిచేయడం వీటన్నింటిపై రఘురామ కుటుంబ సభ్యులు స్పీకర్‍కు ఫిర్యాదు చేశారు. రఘురామపై రాజద్రోహం కింద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారన్నారు. రాఘురామకు ప్రాణహాని ఉందని, ఈ విషయంలో స్పీకర్ జోక్యం చేసుకోవాలని వారు కోరారు. రఘురామ కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై ఓం బిర్లా సానుకూలంగా స్పందించారు. దీనిపై ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసి నివేదిక తెప్పిస్తానని, చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటానని వారికి హామీ ఇచ్చినట్లు సమాచారం.
అంతకుముందు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‍నాథ్‍సింగ్‍తోనూ రఘురామ కుటుంబ సభ్యులు సమావేశమయ్యారు. వైకాపా ప్రభుత్వం రఘురామను కుట్రపూరితంగా వేధింపులకు గురిచేస్తోందని ఫిర్యాదు చేశారు. ఆయన ప్రాణానికి ముప్పు ఉందని, జగన్ ప్రభుత్వం నుంచి రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.