ఈసారి కూటమిదే గెలుపు..జగన్ కు రఘురామరాజు సవాల్..
లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల జాబితాలో ఆరుగురి పేర్లను నిన్న బీజేపీ ప్రకటించింది. నరసాపురం నుంచి తన పేరు లేకపోవడంపై ఎంపి రఘురామకృష్ణరాజు స్పందించారు. జగన్ తనకు సీటు రాకుండా అడ్డుపడ్డాడు అంటూ ఆయన ఆరోపించారు. చాలా రోజుల నుంచి జగన్ తనకు షాక్ ఇవ్వాలని చూస్తున్నాడని.. బీజేపీ నుంచి తనకు టికెట్ రాకుండా అడ్డుకుంటాడని కొందరు చెబుతూ వస్తున్నారు అని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. టికెట్టు దక్కకపోయినా సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉండి జగన్ కు వ్యతిరేకంగా పనిచేయడానికి రఘురామరాజు ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది. జగన్ కి తగిన గుణపాఠం చెబుతానని ఓపెన్ గానే సవాలు విసురుతున్నాడు రఘురామరాజు. ఓ బిజెపి నేత ద్వారా తనకు సీటు రాకుండా జగన్ అడ్డుపడ్డాడని.. అయితే తాను నరసాపురం నుంచి పోటీ చేస్తానా లేక మరెక్కడి నుంచి అయినా చేస్తానా అనేది కాలమే నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. తనకు సీటు దక్కకపోయినా జగన్ అనుకున్నది మాత్రం ఈసారి జరగదని.. రాబోయే ఎన్నికలలో కూటమిదే గెలుపని రఘురామరాజు కచ్చితంగా చెప్పారు.













