లోకేశ్‌ను కలిసిన వైసీపీ ఎంపీ కుమారుడు..!
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. రెండు పార్టీలూ ఎత్తులు, పైఎత్తులతో రాజకీయాన్ని రసవత్తరంగా మార్చేస్తున్నాయి. ప్రతిపక్షాన్ని సమూలంగా రూపుమాపేందుకు అధికార వైసీపీ పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ.. ఈసారి అంతకుమించి విజయాన్ని కైవసం చేసుకోవాలని టార్గెట్ గా పెట్టుకుంది. అయితే పరిస్థితులన్నీ ఆ పార్టీ అనుకున్నట్టు లేవనే ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీపై ప్రజావ్యతిరేకత బలంగా ఉందని.. అది తమకు కచ్చితంగా కలిసి వస్తుందని విపక్షాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా నారా లోకేశ్ పాదయాత్ర తమకు ప్లస్ అవుతుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. తాజాగా వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కుమారుడు భరత్ .. నారా లోకేశ్ ను కలవడం చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం నారా లోకేశ్ పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో సాగుతోంది. గోదావరి జిల్లాలో అడుగు పెట్టిన లోకేశ్ పాదయాత్రకు స్థానికంగా మంచి స్పందన వస్తుండడం టీడీపీ శ్రేణుల్లో సంతోషం నింపుతోంది. తాజాగా.. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కుమారుడు భరత్ .. ఉండిలోని ఓ ఫంక్షన్ హాల్లో లోకేశ్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకేరోజు రెండు సార్లు వాళ్లిద్దరి మధ్య సమావేశం జరిగింది. వాళ్ల మధ్య ఏం చర్చకు వచ్చిందనేది బయటకు వెల్లడి కాలేదు. అయితే తాజా రాజకీయ పరిస్థితులపైనే వాళ్లిద్దరి మధ్య చర్చ జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన రఘురామ కృష్ణంరాజు నర్సాపురం నుంచి ఎంపీగా గెలిచారు. గెలిచిన కొన్ని నెలలుగా ఆ పార్టీ అధినేత జగన్ తో విభేదించి రెబెల్ గా మారారు. బీజేపీకి దగ్గరయ్యారు. సొంతపార్టీ వైసీపీ పైనే విమర్శలు గుప్పిస్తున్నారు. రఘురామ కృష్ణంరాజుపై వైసీపీ ఫిర్యాదులు చేసినా.. బీజేపీకి అనుకూలంగా ఉండడంతో ఆయనపై చర్యలు తీసుకోలేదు. దీంతో ఆయన నోటికి తాళం పడలేదు సరికదా.. రోజురోజుకూ విమర్శలు మరింత ఎక్కువగా గుప్పిస్తున్నారు. అయితే నర్సాపురం వస్తే రఘురామ కృష్ణంరాజుకు తగిన బుద్ధి చెప్పాలని వైసీపీ స్కెచ్ వేసింది. అయితే ఆయన మాత్రం నర్సాపురంలో అడుగు పెట్టట్లేదు. కుమారుడు భరతే అన్ని వ్వవహారాలను చక్కబెడుతున్నారు.
నర్సాపురం నుంచి ఈసారి కూడా తాను బరిలోకి దిగుతానని రఘురామ కృష్ణంరాజు ఇటీవల వెల్లడించారు. అయితే ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది చెప్పలేదు. ఇప్పుడు ఆయన కుమారుడు భరత్.. లోకేశ్ ను కలవడంతో టీడీపీ తరపున పోటీ చేస్తారనే ఊహాగానాలు బలపడ్డాయి. అయితే ఈసారి భరత్ అసెంబ్లీ బరిలో దిగుతారనే ప్రచారం కూడా ఉంది. అయితే తండ్రీ కొడుకుల్లో ఎవరు ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారనే ఇప్పటివరకూ అధికారికంగా వెల్లడి కాలేదు. త్వరలోనే ఈ సస్పెన్స్ కు బ్రేక్ పడుతుందని భావించవచ్చు.













