ఏపీలో రఘురామ, తెలంగాణలో ఈటల..!

రాజ్యానికి ఎదురేగితే అంతే.! రాజ్యంతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో మనం చరిత్రలో ఎన్నో ఉదాహరణలను చూశాం. ఇప్పుడు కూడా మన కళ్ల ముందు రెండు ఉదాహరణలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఈటల రాజేందర్, ఆంధ్రప్రదేశ్ లో రఘురామ కృష్ణంరాజు.. ఇద్దరూ రాజ్యంతో పెట్టుకుని ఇబ్బందులు పడుతున్నారు. వీళ్లు చేసిన తప్పేంటి.. వీళ్ల భవిష్యత్తు ఏంటి.. అనేవి ఇప్పడు ఆసక్తికర పరిణామాలు.
ఈటెల రాజేందర్ విషయానికొస్తే టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఎంతో కీలకమైన నేత. టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు అత్యంత నమ్మకస్తుడు కూడా. కెసిఆర్ ఈటెల రాజేందర్ ను తమ్ముడిగా సంబోధిస్తూ ఉంటారు. కేసీఆర్ ఢిల్లీలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎన్నో అవమానాలను భరించి తెలంగాణ రాష్ట్ర సమితిని ఇక్కడ నిలబెట్ట గలిగారు ఈటల రాజేందర్. ఆత్మగౌరవ నినాదం ఈటెల రాజేందర్ ప్రధాన అస్త్రం. కానీ ఈటెల రాజేందర్ ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ పై అసంతృప్తి స్వరం వినిపించారో.. అప్పటినుంచి కేసీఆర్ ఈటల రాజేందర్ ను దూరం పెట్టడం ప్రారంభించారు. అప్పుడు మొదలైన యుద్ధం ఇప్పుడు తారాస్థాయికి చేరింది.
ఈటెల రాజేందర్ భూ ఆక్రమణలకు పాల్పడ్డారంటూ ఆయనను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు కేసీఆర్. ఆయన భూములపై విచారణకు ఆదేశించారు. అయితే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో విచారణ కాస్త నెమ్మదించింది. ఏదైతేనేం రాజ్యానికి ఎదురేగి ఈటెల రాజేందర్ ఇప్పుడు అనేక ఇబ్బందులు పడుతున్నారు. హ్యాపీగా సాగిపోతున్న ప్రయాణంలో ఇప్పుడు ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు. అయితే.. ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది ఇప్పడే చెప్పే పరిస్థితి లేదు. సొంత పార్టీ పెడతారా లేకపోతే ఉన్న పార్టీలో చేరతారా అనేది చూడాల్సి ఉంది. మొత్తానికి రాజ్యంతో ఎదురేగితే పరిణామాలు ఎన్నో అవమానాలు భరించాల్సి ఉంటుందనేది మాత్రం అర్థమవుతోంది.
ఇక ఆంధ్రప్రదేశ్ లో రఘురామకృష్ణంరాజు పరిస్థితి కూడా ఇదే. రఘురామకృష్ణం రాజును వదిలించుకోవడానికి వైసీపీ అధిష్టానం ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. రఘురామకృష్ణంరాజు ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధినేతలను అవమానించారంటూ ఆయనపై కేసు దాఖలైంది. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ్డారని సీఐడీ కేసు నమోదు చేసింది. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. రఘురామకృష్ణంరాజు వైసీపీ తరఫున గెలిచిన తర్వాత చాలా సందర్భాల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా గళమెత్తారు. ఆయన వైసీపీకి ఎందుకు దూరం కావాల్సి వచ్చింది, ఆయన్ను సీఎం జగన్ ఎందుకు దూరం పెట్టారు.. అనే అంశాలు ఇప్పటికీ ఆసక్తికరమే. కానీ వాటికి సమాధానాలు దొరికే పరిస్థితి లేదు. అయితే.. రాజ్యంతో పెట్టుకున్నప్పుడు ఎంతటివాళ్లకయినా ఇబ్బందులు తప్పవు అనే విషయాలను ఈ రెండు ఉదంతాలు మనకు నిరూపిస్తున్నాయి.
మరి ఇప్పుడు వీళ్ళిద్దరి భవిష్యత్తు ఏంటి.. వాళ్లు ఏం సాధించబోతున్నారు.. రాజ్యాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి. భవిష్యత్తులో వీటికి సంబంధించిన పరిణామాలు మాత్రం ఖచ్చితంగా ఆసక్తికరంగా ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి చూద్దాం.. ఏం జరుగుతుందో..!