RRR: నన్ను కొట్టిన వాడు బీహార్ పారిపోయాడు: రఘురామ

హిందీ నటి జాత్వాని కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులును(PSR) అరెస్టు చేయడంపై డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణం రాజు(RRR) స్పందించారు. హీరోయిన్ కేసులో నిందితులను అరెస్ట్ చేయడంతో.. అదే బాటలో ఇప్పుడు తన కస్టోడియల్ టార్చర్ కేసు కూడా వేగం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసారు. తాను ఒక బాధితుణ్ణి… నన్ను లాకప్ లో చితక్కొట్టారని ఆవేదన వ్యక్తం చేసారు. నా పరిస్థితి అందరూ కల్లారా చూశారన్నారు. ఎందరో నాయకులు ఎన్నో సమావేశాలలో కూడా చెప్పారని వెల్లడించారు.
లాకప్ లో అయిన గాయాలకు సంబంధించిన మిలటరీ ఆసుపత్రి నివేదిక ఉందన్నారు. అయినప్పటికీ, ఈ కేసులో ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్టు చేశారని అన్నారు. 90 రోజులు దగ్గర పడ్డాయి. వారిద్దరూ కూడా జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ కేసులో ఒక మహిళ అయినప్పటికీ ఆమె దొరకలేదని.. భలే తప్పించుకుంది ఆశ్చర్యం వ్యక్తం చేసారు. సుప్రీం కోర్టు టెంపరరీ ప్రొటెక్షన్ ఆమెకు దొరికిందన్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తాత్కాలిక సంరక్షణ ఈనెల 24వ తేదీన ముగియనుందన్నారు.
మళ్లీ కోర్టు విచారణకు రానుందని అన్నారు. ఈసారి విచారణలో మళ్లీ ఆమెకు ప్రొటెక్షన్ ఇస్తే గతం ఏది గుర్తుకు రాదని వ్యాఖ్యానించారు. ఒక్కరోజైనా ప్రొటెక్షన్ ఇవ్వకుండా ఆపితే ఆమెకు అన్నీ గుర్తుకు వస్తాయని, అందులో ఎటువంటి సందేహం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ నిఘా విభాగం అధిపతి సీతారామాంజనేయులు ను ఏపీ సిఐడి పోలీసులు ఈరోజు ఉదయం 9 గంటలకు అరెస్టు చేసినట్లుగా టీవీ మాధ్యమం ద్వారా ఓ శుభవార్త విన్నాను అన్నారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇంటలిజెన్స్ విభాగం చీఫ్ గా సీతా రామాంజనేయులు ఎన్నో అనైతిక కార్యక్రమాలకు పాల్పడ్డాడని ఆయన మండిపడ్డారు.
జగన్మోహన్ రెడ్డి చూసి రమ్మంటే కాల్చి వచ్చిన సార్ధక నామధేయుడని తన మార్క్ కామెంట్స్ చేసారు. ముందుగా నన్ను లాకప్ లో చిత్రహింసలకు గురి చేశారని, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు హిందీ నటి జత్వానిని అక్రమంగా అపహరించి వేధింపులకు గురి చేశారని మండిపడ్డారు. సిఐడి ప్రస్తుతం ఈ కేసును విచారిస్తోందన్నారు రఘురామ. కస్టోడియల్ టార్చర్ కేసులో A1 పివి సునీల్ కుమార్, A2 సీతా రామాంజనేయులని వ్యాఖ్యానించారు. ఇదే కేసులో సునీల్ నాయక్ అనే వ్యక్తి కీలకమని, అతను బీహార్ బదిలీ అయ్యాడని, అతన్ని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు. తనను కొట్టినప్పుడు పక్క గదిలోనే ఉన్నాడన్నారు రఘురామ. అతనే అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు.