Raghu Ram Krishna Raju: సుపరిపాలన సభలో ఎమ్మెల్యేలకు అవమానం.. రఘురామకృష్ణరాజు వైరల్ స్టేట్మెంట్..

ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పురస్కరించుకుని ఇటీవల అమరావతి (Amaravati)లో కూటమి ‘సుపరిపాలనలో తొలి అడుగు’ అనే పేరుతో గ్రాండ్ గా కార్యక్రమం నిర్వహించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), కేంద్ర మంత్రి పురందేశ్వరి (D. Purandeswari), రాష్ట్ర మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య కార్యదర్శి, డీజీపీ, మరియు ఇతర అధికారులు హాజరయ్యారు.
అయితే, ఈ వేడుకలో ఎమ్మెల్యేలకు తగిన గౌరవం కల్పించలేదంటూ ఏపీ శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు (Raghu Rama Krishna Raju) విమర్శలు చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, కార్యక్రమంలో అధికార ప్రోటోకాల్ పాటించకపోవడం వల్ల ప్రజా ప్రతినిధులకు అవమానం జరిగింది. కొన్ని టేబుళ్ళ వద్ద కలెక్టర్‌లు (Collectors), ఎస్పీలు (SPs), ఎంపీలు (MPs) కూర్చుండగా, మరో టేబుల్ వద్ద కార్పొరేషన్ డైరెక్టర్లతో కలిసి ఎమ్మెల్యేలను కూర్చోబెట్టారని ఆయన ఆరోపించారు.
ఇలాంటి ప్రాముఖ్యమైన కార్యక్రమంలో స్పీకర్ (Speaker), డిప్యూటీ స్పీకర్ (Deputy Speaker) లను ఆహ్వానించకపోవడం కూడా ఆయన అసంతృప్తికి కారణమైంది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసే ఉద్దేశాన్ని రఘురామ తెలిపారు. అయితే ఇది మొదటి తప్పుగా అనిపించిందని, అదే సమయంలో తాను అక్కడికి హాజరై ఉండి సీటింగ్ విధానాన్ని గమనించి ఉంటే వెంటనే బయటకు వచ్చేసేవాడినని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులకే ఈ స్థాయి అవమానం జరగడం విచారకరమని ఆయన అన్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు తన వద్దకు వచ్చి ఇదే విషయాన్ని వ్యక్తపరిచినందునే తను ఈ విషయాన్ని ప్రస్తావించాల్సి వచ్చిందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు ఈ అంశాన్ని గమనించి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలనే ఆశ వ్యక్తమవుతోంది.