EVM: ఈవీఎంలపై అలిగిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే..! కీలక ప్రకటన..!!
దేశంలో ఇప్పుడు ఎన్నికలన్నీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (EVM) ద్వారానే జరుగుతున్నాయి. అయితే వీటి వాడకంపై అనేక వివాదాలున్నాయి. ఓడిపోయినప్పుడు ఒకలా, గెలిచినప్పుడు ఒకలా మాట్లాడుతున్నారు నేతలు. గెలిచినప్పుడు స్వాగతించే నేతలు.. ఓడిపోగానే అవి ఫేక్ (fake) అని విమర్శిస్తున్నారు. ఇప్పుడు వైసీపీ నేతలు (YSRCP Leaders) కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ (YCP) ఓడిపోవడానికి, కూటమి (NDA Alliance) గెలవడానికి ఈవీఎంలే (EVMs) కారణమనేది ఆ పార్టీ నేతలు చెప్తున్నమాట. అందుకే వచ్చే ఎన్నికలను కూడా ఈవీఎంల ద్వారానే నిర్వహిస్తే తాను పోటీ చేయబోనని ఓ మాజీ ఎమ్మెల్యే ప్రకటించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
కడప జిల్లా ప్రొద్దుటూరు (proddatur) మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి (Rachamallu Siva Prasad Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో కూటమి పార్టీలు ఈవీఎంలలో అక్రమాలు చేసి గెలిచారని.. వాటిని ట్యాంపరింగ్ (tampering) చేశారని ఆరోపించారు. ఎన్నికలు జరిగిన తీరుపై తమకు అనేక సందేహాలున్నాయని.. వాటిని నివృత్తి చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరినా స్పందించట్లేదని ఆరోపించారు. వచ్చే ఎన్నికలను బ్యాలెట్ (ballot paper) ద్వారా నిర్వహించాలని డిమాండ్ చేశారు. దేశంలో 18 దేశాలు మాత్రమే ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికలను బ్యాలెట్ ద్వారా జరిపితేనే తాను పోటీ చేస్తానని.. లేకుంటే చేయనని స్పష్టం చేశారు.
రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాత్రమే కాదు.. వైసీపీ నేతలు, కార్యకర్తలు, ఆ పార్టీ సోషల్ మీడియా (social media) విభాగం కూడా ఈవీఎంలపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీ అధినేత జగన్ (YS Jagan) కూడా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు. చంద్రబాబును (CM Chandrababu) ఈవీఎం ముఖ్యమంత్రిగా అభివర్ణిస్తున్నారు. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఓడిపోయిన పలువురు వైసీపీ కేసులు కూడా దాఖలు చేశారు. వాటిపై అనుమానాలు నివృత్తి చేసేందుకు ఎన్నికల సంఘం (Election Commission) ప్రయత్నించింది. అయితే తాము అడిగింది ఒకటైతే ఈసీ (ECI) మరొకటి చూపిస్తోందని వైసీపీ నేతలు విమర్శించారు. దీంతో ఈ వివాదం కొలిక్కిరాలేదు.
వాస్తవానికి 2019లో వైసీపీ గెలిచింది.. టీడీపీ (TDP) ఓడిపోయింది. అప్పుడు టీడీపీ నేతలు కూడా ఈవీఎంలను అనుమానించారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అప్పుడు వైసీపీ గెలిచింది కాబట్టి ఈవీఎంలపై నోరు మెదపలేదు. గెలిచినప్పుడు ఈవీఎంలను స్వాగతించిన వైసీపీ.. ఓడిపోగానే వాటిపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని కూటమి పార్టీలు ఎద్దేవా చేస్తున్నాయి. గెలిచినప్పుడు కూడా ఈవీఎంలలో అవకతవకల వల్లే గెలిచామని.. వీటిని రద్దు చేసి బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని.. ఎందుకు డిమాండ్ చేయలేదని ఆయా పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరి దీనికి వైసీపీ సమాధానం చెప్తుందా.?













