‘మేఘా’కు పీవీ రమేశ్ రాజీనామా..! ఏం జరిగింది?
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయ్యారు. ఆయనకు కోర్టు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. బెయిల్ కోసం ఆయన తరపు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు పూర్తిగా రాజకీయమేనని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. చంద్రబాబు తప్పు చేయడం వల్లే ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారని వైసీపీ కౌంటర్ ఇస్తోంది. ఈ ఎపిసోడ్ అంతటికీ మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ కేంద్ర బిందువుగా మారారు. ఆయన వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు.
చంద్రబాబు నాయుడు 2014-2019 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక శాఖ సెక్రటరీ హోదాలో పని చేశారు పీవీ రమేశ్. సమర్థ అధికారిగా ఆయనకు పేరుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు పీవీ రమేశ్ కామెంట్స్ వల్లే జరిగిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన రాసిన నోట్ ఫైల్స్ వల్లే చంద్రబాబుకు ఇబ్బంది తలెత్తిందని చెప్తున్నారు. సీఎం చెప్పినందున సీమెన్స్ సంస్థకు నిధులు విడుదల చేశామని పీవీ రమేశ్ నోట్ ఫైల్స్ లో పేర్కొన్నారు. అయితే ఇందులో కీలక పాత్రధారులైన స్కిల్ డెవలప్మెంట్ ఎండీ, కార్యదర్శి ఎక్కడికి పోయారని ఇప్పుడు పీవీ రమేశ్ ప్రశ్నిస్తున్నారు. అంతేకాక ఆ ఫైల్స్ ఎక్కడికి పోయాయని నిలదీస్తున్నారు.
తన వల్లే చంద్రబాబు అరెస్ట్ అయ్యారనే వార్తల నేపథ్యంలో పీవీ రమేశ్ మీడియా ముందుకొచ్చి క్లారిటీ ఇచ్చారు. ఇందులో సీఐడీ తీరు అనుమానాస్పదంగా ఉందన్నారు. దీంతో సీఐడీ కూడా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ విషయం పక్కన పెడితే మేఘా సంస్థ సలహాదారు పదవికి పీవీ రమేశ్ నిన్న రాజీనామా చేయడం సంచలనం కలిగిస్తోంది. రిటైర్డ్ అయిన తర్వాత పీవీ రమేశ్ సేవలను వాడుకునేందుకు మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఆయన్ను సలహాదారుగా నియమించుకుంది. అప్పటి నుంచి ఆయన సలహాదారుగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు హఠాత్తుగా ఆయన వైదొలగడం చర్చనీయాంశమైంది.
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పీవీ రమేశ్ సీఐడీపై ఆరోపణలు చేశారు. ఇది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో పీవీ రమేశ్ ను తప్పించాలని మేఘాను సీఎం జగన్ ఆదేశించారని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అందుకే ఆయన రాజీనామా చేశారని చెప్పుకుంటున్నారు. అయితే పీవీ రమేశ్ మాత్రం తనను మేఘా సంస్థ రాజీనామా చేయమని చెప్పలేదని వివరించారు. మొత్తానికి ఇప్పుడు కథంతా పీవీ రమేశ్ చుట్టూ తిరుగుతోంది. అసలు ఈ కేసులో ఏం జరిగిందనేదానిపై త్వరలోనే పీవీ రమేశ్ మీడియా ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది. అప్పుడు ఇంకెన్ని సంచలన విషయాలు బయటపడతాయో వేచి చూడాలి.













