తిరుమలలో వైభవంగా పుష్పయాగం
తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రాల్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం పుష్పయాగాన్ని నిర్వహించింది. ఉత్సవమూర్తులను పట్టువస్త్రాభరణాలతో అలంకరించి స్వర్ణపీఠంపై ఆసీనులను చేశారు. తర్వాత శ్రీనివాసునికి విశేష రీతిలో పుష్పయాగం ప్రారంభమైంది. ఉత్సవమూర్తుల పాదాల నుంచి హృదయం వరకు పూలతో ముగినే వరకూ నివేదన జరిగింది. అనంతరం వాటికి ధూపదీప నీరాజనాలు సమర్పించి, ఆ విరులను పాదాల వరకు సవరించారు. తొమ్మిది టన్నుల బరువైన 14 రకాల కుసుమాలతో, ఆరు రకాల పత్రాలతో ఈ వేడుకను పూర్తి చేశారు. ఈ పూలన్నీ దేశ, విదేశాల నుంచి దాతలు వితరణగా అందించినవే కావడం విశేషం.













