Purandeswar :మాతృభాషను రక్షించుకోకపోతే.. అది మన ఉనికికే ప్రమాదం : పురందేశ్వరి
ప్రకృతి పట్ల అవగాహన పెంచుకోవడమే సంక్రాంతి అసలు లక్ష్యమని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి (Purandeswar) అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో నిర్వహించిన రెండో ప్రపంచ తెలుగు మహాసభల్లో (World Telugu Congress) ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ తెలుగు సంస్కృతిని అంతా అర్థం చేసుకోవాలని చెప్పారు. మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశంలో ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన ఆరింటిలో తెలుగు ఒకటని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు 15వ భాష అని పేర్కొన్నారు. మన దేశంలో ఎక్కువగా మాట్లాడే వాటిలో నాలుగోది అన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని కృష్ణదేవరాయులు (Krishnadevaraya) ఏనాడో చెప్పారు. మాతృభాషను రక్షించుకోకపోతే అది మన ఉనికికే ప్రమాదం. జీవోలు తెలుగులో ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం. ఎన్టీఆర్ (NTR) సీఎంగా ఉన్నప్పుడు జీవోలు తెలుగులో ఇచ్చేవారు. మహానదిగా విలసిల్లిన తెలుగు, ఇప్పుడు పిల్ల కాలువగా మారుతోందని బాధగా ఉంది అని పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.













