Quantum Valley: క్వాంటమ్ వ్యాలీ ఐకానిక్ భవనం ఆకృతి సిద్దం : ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం

అమరావతి క్వాంటమ్ వ్యాలీ (Quantum Valley) ఐకానిక్ భవనం నమూనా ఖరారైంది. వ్యాలీలోకి ప్రవేశించే ప్రధాన భవనాన్ని అమరావతి ఆకృతిని తలపించేలా, దీనికి ఇరువైపులా నాలుగేసి భారీ టవర్లను ఏర్పాటు చేసేలా ఆకృతులను తీర్చిదిద్దారు. ప్రపంచంలోనే మేటి భవనంగా ఉండాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఈ డిజైన్లను ఎల్‌అండ్‌టీ (L&T) సంస్థ తయారు చేసింది. ఎటువైపు నుంచి చూసినా ఒకే విధంగా కనిపించేలా ఉన్న ఆకృతులను ప్రభుత్వం ఖరారు చేసింది. 3డీ ప్రింటింగ్ సాంకేతికతతో దీన్ని నిర్మించనున్నారు. సుమారు 10కి పైగా ఆకృతులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పరిశీలించారు. నిర్మాణ సంస్థ, అధికారులతో 8 సార్లు సమావేశమైన ఆయన తగిన మార్పులు సూచించారు. రెండు నెలల తర్వాత తుది ఆకృతి ఖరారైంది.
హైదరాబాద్ హైటెక్‌సిటీ (Hi-tech City) లోని సైబర్ టవర్స్ (Cyber Towers) భవనానికి దీటుగా క్వాంటమ్ వ్యాలీ భవనాల ఆకృతి ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. క్వాంటమ్ పరిశ్రమల కోసం 80-90 లక్షల చదరపు అడుగులు అందుబాటులోకి రానుంది. పరిశోధనలు, క్వాంటమ్ అనుబంధ పరికరాల తయారీ యూనిట్ల ఏర్పాటుద్వారా సుమారు 80-90 వేల మంది పనిచేసేందుకు వీలుగా మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.