అయితే ప్రైవేటుకు.. లేకుంటే క్లోజ్..! కేంద్రం మరో బాంబు..!!
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమాలు వృథా అయిపోతాయమో అనే ఆందోళన రోజురోజుకూ ఎక్కువవుతోంది. కేంద్రం ప్రైవేటీకరణకే జైకొడుతుండడంతో ఉద్యోగులు, కార్మికుల ఆవేదన వృధాగా మిగిలిపోతుందేమో అనిపిస్తోంది. రాజకీయ పార్టీలు కూడా హడావుడి చేస్తున్నాయే తప్ప కార్యాచరణకు దిగడం లేదు. ప్రభుత్వం లెటర్లు రాస్తున్నా కేంద్రం నుంచి స్పందన ఉండట్లేదు. దీంతో రోజురోజుకూ ఆశలు సన్నగిల్లుతున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్రం మరో బాంబు పేల్చింది. ఒకవేళ విశాఖ ప్రైవేటీకరణకు ఎవరూ ముందుకు రాకపోతే దాన్ని మూసేస్తామని స్పష్టం చేసింది. కేవలం విశాఖ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న పలు ఉక్కుసంస్థలను కూడా క్లోజ్ చేస్తామని తేల్చేసింది. బీజేడీ ఎంపీ సస్మిత్ అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. విశాఖ ప్రైవేటీకరణపై వెనక్కు తగ్గేది లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేసి 24 గంటలు గడవకముందే కేంద్రం ఈ మాట చెప్పడంతో విశాఖ ఉక్కు ప్లాంటు ఉద్యోగులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
ఉక్కు ఫ్యాక్టరీల ప్రైవేటీకరణ వివిధ అంశాలపై ఆధారపడి ఉందని మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఐదేళ్లలో ఉక్కు పరిశ్రమలన్నింటినీ ప్రైవేటీకరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ ఈ మేరకు సిఫారసు చేసిందని తెలిపారు. ఉక్కు తయారీ రంగం నాన్ స్ట్రాటజిక్ రంగంలోకి వస్తుందన్న మంత్రి.. ఈ రంగంలోకి వచ్చే అన్ని ప్రభుత్వరంగ వాణిజ్య పరిశ్రమలను ప్రైవేటీకరించాలని నిర్ణయించామని.. ఒకవేళ వాటిని కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోతే.. మూసివేయాలని తీర్మానించామని స్పష్టం చేశారు.
ఆత్మనిర్భర భారత్ కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 4న ప్రభుత్వ రంగ సంస్థల విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులు, సంస్థలు, బీమా సంస్థలకు వర్తిస్తుంది. వీటిలో పెట్టుబడుల ఉపసంహరణ అనేది ఆ రంగంలోని ట్రెండ్స్, పరిపాలనా సాధ్యాసాధ్యాలు, పెట్టుబడిదారుల ఆసక్తి.. తదితర అంశాలపై ముడిపడి ఉంటుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ తో పాటు దేశవ్యాప్తంగా 6 పరిశ్రమల్లో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఆయా సంస్థలను ఎవరూ కొనేందుకు ముందుకు రాకపోతే.. వాటిని మోసేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. ఈ నష్టాలను ఇంకా భరించే స్థితిలో లేమని కేంద్రం పెద్దలు క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ప్రైవేటు వ్యక్తులు దీన్ని కొనేందుకు ముందుకు రాకపోతే ఉద్యోగులు ఇళ్లకు వెళ్లక తప్పదు.













