భక్తుల కోసం ఆలయాల మాసపత్రికల ముద్రణ : ఎపి దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో జరిగే కార్యక్రమాలు, ఆలయ విశిష్టత, ఇతర విషయాలను భక్తులకు తెలియజేసేందుకు వీలుగా ప్రముఖ దేవాలయాల్లో మాసపత్రికలను ప్రచురించే విధంగా చర్యలు చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో టెంపుల్ టూరిజానికి మంచి ప్రాచుర్యం ఉందని, అదే తరహాలో రాష్ట్రంలో కూడా టెంపుల్ టూరిజానికి మంచి ప్రాచుర్యం కల్పించేందుకు అన్ని రకాల చర్యలను తీసుకుంటాము న్నారు. దేవాదాయశాఖ పరంగా ఇప్పటికే ‘‘ఆరాధన’’ అనే మాస పత్రికను ప్రచురించడం జరుగుచున్నదని, ఈ మాస పత్రిక కు 32 వేలకు పైగా చందాదారులు ఉన్నారన్నారు. రాష్ట్రంలో అన్ని దేవాలయాల ప్రాశస్త్యాన్ని, విశేషాలను, పలు దేవాలయాల్లో జరిగే విశేష కార్యక్రమాలతో పాటు ప్రముఖ ప్రవచన కర్తలైన చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు, సామవేదం షణ్ముఖ శర్మ తదితరులతో ధర్మ సందేహాలకు సరైన సమాధానాలను ఈ పత్రికలో ప్రచురించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.
విజయవాడలో ప్రముఖ దేవాలయమైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంవారు ‘కనక దుర్గ ప్రభ అనే మాస పత్రికను, శ్రీశైల దేవస్థానం వారు ‘శ్రీశైల ప్రభ’ అనే మాస పత్రికను ప్రచురించడం జరుగుచున్నదని, భక్తులకు అవసరమైన ఆధ్యాత్మిక సమాచారాన్ని మరింత విస్తృత స్థాయిలో ఆయా మాస పత్రికల్లో ప్రచురించేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీచేయడం జరిగిందన్నారు. అదే విధంగా పలు ప్రముఖ దేవాలయాలైన అన్నవరం, సింహాచలం, శ్రీకాళహస్తి, కాణిపాకం తదితర దేవాలయాలు కూడా నూతనంగా మాస పత్రికలను ప్రచురించేందుకు అందుకు అవసరమైన అన్ని పరిపాలనా అనుమతులను మంజూరు చేశామని చెప్పారు. ఒక ప్రాంతంలోని దేవాలయాల్లోని విశేషాలను, 6 (ఎ) దేవాలయాల వివరాలను, ఆయా దేవాలయాల్లో జరిగే కార్యక్రమాలను, విశేషాలను మరొక ప్రాంత వాసులకు తెలియజేసే విధంగా ఈ మాస పత్రికలను ప్రచురిస్తామన్నారు. ఇందుకై రాష్ట్ర స్థాయిలో ఒక కేంద్రీకృత సలహా, సంపాదక మండలిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.













