మిమ్మల్ని కోర్టుకు పిలవడం మాకు ఇబ్బందిగా ఉంది
కోర్టు ధిక్కారం కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, హోంశాఖ కార్యదర్శి, ఐజీ మహేష్‌చంద్ర లడ్డా, ఏలూరు డీఐజీ హైకోర్టుకు హాజరయ్యారు. ఎస్ఐ రామరావు తన పదోన్నతి విషయంలో గతంలో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం పదోన్నతి జాబితాలో రామారావు పేరు చేర్చాలని పోలీసు శాఖను ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలిచ్చినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదంటూ రామారావు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం డీజీపీ గౌతమ్ సవాంగ్, హోం శాఖ కార్యదర్శి, ఐజీ మహేష్‌చంద్ర లడ్డా, ఏలూరు డీఐజీని కోర్టుకు హాజరుకావాలని గతంలో ఉత్తర్వులు జారీ చేసింది.
మూడు నెలలు గడిచిన ఎస్సై రామారావు పదోన్నతి విషయంలో కోర్టు ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని డీజీపీని న్యాయస్థానం ప్రశ్నించింది. మిమ్మల్ని ఇలా ప్రతిసారీ కోర్టుకు పిలవడం మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని విచారణ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ ఫిబ్రవరి 25వ తేదీకి వాయిదా వేసింది.













