Prime Minister Modi :ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Modi) విశాఖ లో ఈ నెల 8న పర్యటించనున్నారు. మోదీ పర్యటన ఏర్పాట్లకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మంత్రివర్గం సహచరులతో సుదీర్ఘంగా చర్చించారు. కేబినెట్ భేటీలో భాగంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర బలగాలతో విస్తృత బందోబస్తు నిర్వహించటంతో పాటు జనసమీకరణలో భాగంగా కూటమి పార్టీల నేతలతో రాజకీయ వ్యవహారాల సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి మోదీ ఆరోజు ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University) ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో ప్రధాన మంత్రి బహిరంగ సభకు హాజరు కానున్న నేపథ్యంలో వేదిక నిర్వహణపై మంత్రివర్గం చర్చించింది. సంపత్ వినాయక దేవాలయం నుండి మీటింగ్ జరిగే ఆంధ్ర విశ్వవిధ్యాలయం వేదిక వరకు రోడ్ షో నిర్వహిస్తారు.
పూడిమడకలో ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు దేశ ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.65,370 కోట్ల మేరకు మూడు దశల్లో పెట్టుబడులు రానున్నాయి. ఈ సందర్భంగా కృష్ణపట్నం ఇండస్ట్రీయల్ హబ్‌ను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. కాగా విశాఖ వాసుల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రైల్వే జోన్(Special Railway Zone) ఏర్పాటుకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని పర్యటనను విజయవంతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి మంత్రివర్గ సహచరులు, అధికారులను ఆదేశించారు.













