ప్రథమ పౌరుడికి ఘన స్వాగతం
రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుమల, తిరుపతి విచ్చేస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఘనస్వాగతం లభించింది. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా తిరుచానూరు చేరుకుని పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి దర్శించుకోనున్నారు. అనంతరం తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల స్వ్రిమ్స్) ప్రాంగణంలో రూ.140 కోట్లతో నిర్మించిన శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఆస్పత్రి భవనాన్ని ప్రారంబించనున్నారు. అనంతరం ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌర సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే రెండు పథకాలను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం తిరుచానూరు శిల్పారామంలో విందు ఏర్పాటు చేశారు. తర్వాత తిరుమలకు చేరుకుని రాత్రి అక్కడే బస చేయనున్నారు. శనివారం శ్రీవారిని దర్శించుకుని, 11 గంటలకు తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు.













