టెక్నాలజీ హబ్‌గా ఏయు : రాష్ట్రపతి
ఆంధ్ర విశ్వవిద్యాలయం భవిష్యత్‌లో మరింతగా అభివృద్ది సాధిస్తుందని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా ఏయూను సందర్శించిన రాష్ట్రపతి వర్సిటీ స్నాతకోత్సవ మందిరంలో ఏర్పాటు చేసిన కార్య్కమంలో ఇంక్యుబేషన్ సెంటర్, ఇ-క్లాస్ రూమ్స్, లాబొరేటరీల శిలఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రకటించారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ దేశంలోనే ఎంతో ప్రత్యేకత కలిగిన వర్శిటీగా ఏయూ నిలుస్తుందన్నారు. దేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడులు ఏయూ నుంచి వచ్చారన్నారు. వర్శిటీలో తాము మూడు అంశాలు ప్రారంభించానని వీటన్నింటిని బట్టీ విద్యాపరమైన అంశాలు వర్సిటీలో ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. లింగ సమానత్వం ఉండాలన్నారు. అన్ని రంగాల్లో మహిళలు ఎక్కువమంది ఉండడం అవసరమన్నారు. ఏయూలో నలభై శాతం మంది విద్యార్థినిలు ఉండడం శుభపరిణామమన్నారు.
ఇక్కడ ఏర్పాటు చేసిన డిఫెన్స్ రీసెర్చ్ సెంటర్ ద్వారా సైబర్, నానో, రాడార్, కమ్యూనికేషన్స్ టెక్నాలజీలు సహా మరిన్ని సాంకేతిక కోర్సులు పెద్దఎత్తును ఉపయుక్తంగా నిలువనున్నాయన్నారు. త్వరలో ఏయూ టెక్నాలజీ హబ్‌గా రూపొందుతుందన్నారు. దేశంలోనే రక్షణ రంగాల వారికి కోర్సులు అందిస్తున్న ఏకైక వర్సిటీగా నిలవడం అభినందనీయమన్నారు.













