తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. తిరుమలలోని పద్మావతి విశ్రాంతి భవనం నుంచి బయలుదేరి తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీవారి పుష్కరిణిలో నీటిని ప్రోక్షణం చేసుకున్నారు. అనంతరం శ్రీభూవరాహస్వామివారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి సాదరంగా ఆహ్వానించగా, అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయంగార్, చిన్నజీయంగార్ స్వాములు ఉన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. చైర్మన్ ఈవోలు కలసి శ్రీవారి శేషవ్రస్తం, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు నారాయణస్వామి, సత్యనారాయణస్వామి, రాష్ట్ర మంత్రి రోజా, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరి అనిల్‌కుమార్ సింఘాల్, జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, చిత్తూరు ఎస్పి రిశాంత్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.













