వైభవంగా శ్రీవారి ప్రణయ కలహోత్సవం
తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రణయ కలహోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఆరో రోజు అధ్యయనోత్సవంలో 17వ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సాయంత్రం 4 గంటలకు శ్రీ మలయప్ప స్వామివారు పల్లకి ఎక్కి మహా ప్రదక్షిణ మార్గంలో స్వామివారి పుష్కరిణి వద్దకు వచ్చారు. ఇంతలో అమ్మవార్లు చెరొక పల్లకిపై ప్రదక్షిణంగగా స్వామివారికి ఎదురుగా వచ్చి నిలుచుకున్నారు. పురాణ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరపున జియంగార్లు పూలచెండ్లతో వేటకు వెళ్ళి వచ్చిన స్వామివారిని మూడుసార్లు తాకించారు. స్వామివారు బెదిరినట్లుగా నటించే తానేమి తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయ పడతారు. ఈ ఉత్సవంలో శ్రీ నమ్మాళ్వారు రచించిన ఆళ్వార్ దివ్యప్రబంధంలోని పాశురాలను నిందాస్తుతి శైలిలో అర్చకులు పారాయణం చేయడం ప్రత్యేకత. ఈ సందర్భంగా ఆలయంలో వసంతోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్‌స్వామి, చిన్న జీయర్ స్వామి, టీటీడీ ఈవో అనిల్కుమార్షింఘాల్, ఆలయ డిప్యూటీ ఈవో కోదండరామరావు, పేష్కార్ రమేష్‌బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.













