Pothula Sunitha: ఫలించిన నిరీక్షణ.. బీజేపీలోకి పోతుల సునీత..!

2024 ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మంది వైసీపీకి (YCP) రాజీనామా చేశారు. అయితే వాళ్లలో చాలా మంది ఇతర పార్టీల్లో చేరేందుకు ప్రయత్నాలు చేసినా అవి వర్కవుట్ కాలేదు. అలాంటి వాళ్లలో పోతుల సునీత ఒకరు. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీత (Pothula Sunitha), చాలాకాలం కిందటే ఆ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. ఆమె ఎమ్మెల్సీ రాజీనామాను మండలి ఛైర్మన్ ఇంకా ఆమోదించలేదు. మరోవైపు కూటమి పార్టీల్లో చేరేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు ఆమె ఇప్పుడు బీజేపీ గూటికి చేరారు.
పోతుల సునీత 2017లో తెలుగుదేశం పార్టీ (TDP) తరపున ఎమ్మెల్సీగా (MLC) ఎన్నికయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల (Chirala) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆమె భావించారు. అయితే ఆమెకు పార్టీ ఆ అవకాశం ఇవ్వలేదు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ గెలిచింది. దీంతో 2020లో ఆమె టీడీపీకి (TDP), ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి అప్పటి అధికార పక్షమైన వైసీపీలో చేరారు. వైసీపీ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా మళ్లీ ఎన్నికయ్యారు.
2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసిన తర్వాత పోతుల సునీత పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆమె ఎమ్మెల్సీ పదవీ కాలం 2029 మార్చి వరకు ఉంది. అయినా 2024లోనే ఆమె వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే ఆమె రాజీనామా ఇంకా శాసనమండలి చైర్మన్ ఆమోదం పొందలేదు. ఈ క్రమంలో, ఆమె తిరిగి టీడీపీలో చేరేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. కానీ, టీడీపీ అధిష్ఠానం నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో ఆమె బీజేపీ వైపు మొగ్గారు. బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) సమక్షంలో విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో పోతుల సునీత దంపతులు బీజేపీ కండువా కప్పుకున్నారు.
పోతుల సునీత పార్టీ మారడం వెనుక అనేక కారణాలున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత, పార్టీలో అంతర్గత సమస్యలు, నాయకత్వంపై అసంతృప్తి పెరిగాయి. ఈ నేపథ్యంలో సునీత వంటి నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడుతుందని భావించారు. వైసీపీ బలహీన పడిన సమయంలో బీజేపీ అయితే తమకు అనువుగా ఉంటుందని ఆలోచించారు. కేంద్రంలో అధికారంలో ఉండడం, రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీలు కూడా బీజేపీ అడుగుజాడల్లో నడుస్తూ ఉండడంతో అదే సరైన పార్టీ అని పోతుల సునీత దంపతులు నిర్ణయించుకున్నారు. మరోవైపు బీజేపీ కూడా రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి సునీత లాంటి నాయకులు అవసరమని భావిస్తోంది. అందుకే సునీతను పార్టీలోకి ఆహ్వానించింది.
పోతుల సునీత బీజేపీలో చేరడం వైసీపీకి మరో ఎదురుదెబ్బగా పరిగణించవచ్చు. ఇప్పటికే ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ నుంచి పలువురు నాయకులు దూరమవుతున్న నేపథ్యంలో సునీత రాజీనామా, బీజేపీలో చేరడం వైసీపీ బలాన్ని మరింత బలహీనపరుస్తుంది. అయితే ఆమె రాజీనామా ఇంకా శాసనమండలిలో ఆమోదం పొందలేదు. అయితే ఆమె ఇప్పుడు బీజేపీలో చేరడంతో తన రాజీనామాకు ఆమోదం లభిస్తుందని పోతుల సునీత భావిస్తున్నారు. సునీత మళ్లీ బీజేపీ ద్వారా మండలికి ఎన్నికయ్యే అవకాశాలున్నాయి.
అయితే రాష్ట్రంలో అధికారం మారిన ప్రతిసారీ పోతుల సునీత పార్టీ మారుతూ వస్తున్నారు. ఇది ఆమె నిలకడలేనితనాన్ని సూచిస్తోంది. రాజకీయాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే వాళ్లకు భవిష్యత్తు ఉంటుంది. అలా కాకుండా ఇలా సందర్భానుసారం పార్టీ మారే వాళ్లకు తగిన గుర్తింపు లభించకపోవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు.