పొట్టి శ్రీరాములకు అరుదైన గౌరవం
దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్రదిన వేడుకలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అమరజీవి పొట్టి శ్రీరాములు పేరుతో పోస్టల్ స్టాంపును ఆవిష్కరించినట్లు తపాలా శాఖ నెల్లూరు డివిజినల్ సూపరింటెండెంట్ కరుణాకర్‌బాబు తెలిపారు. నెల్లూరు నగరం సంతపేటలోని పొట్టి శ్రీరామలు అవారుడ్ల గ్రహీత కేవీ చలమయ్య నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధుల సేవలకు గుర్తుగా మై స్టాంపు పేరుతో స్టాంపులను ఆవిష్కరించామన్నారు. విజయవాడ రీజియన్ పరిధిలో మచిలీపట్నంలో స్వాతంత్య్ర సమరయోధులు పింగళి వెంకయ్య, నెల్లూరులో పొట్టి శ్రీరాములు పేరిట వీటిని విడుదల చేసినట్లు తెలిపారు. కేవీ చలమయ్య మాట్లాడుతూ పార్లమెంటు, అసెంబ్లీలో శ్రీరాములు విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు.













