పోలవరం పూర్తి ఎప్పుడో తెలుసా?
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2022 నాటికి పూర్తి అవుతుందని డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ (డీడీఆర్పీ) చైర్మన్ ఏబీ పాండ్యా తెలిపారు. పోలవరం ప్రాజెక్టులోని పలు విభాగాల్లో చేపట్టిన పనులను ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్ ఆయ్యర్ ఇతర సభ్యులతో కలిసి పాండా పరిశీలించిన విషయం తెలిసిందే. నిర్మాణ పనులపై రాజమహేంద్రవరంలో పీపీఏ సభ్యులు, కేంద్ర జల సంఘం సభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ప్రపంచంలోనే పెద్ద గేట్లను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. నిర్మాణ పనులపై అధికారులు, గుత్తేదారులతో చర్చించామని.. పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని చెప్పారు. గేట్ల బిగింపు, అమరికకు సంబంధించి జాగ్రత్తలు సూచించినట్లు పాండ్య తెలిపారు.
ప్రస్తుతం ప్రాజెక్టు పనులు బాగా జరుగుతున్నాయని ఇంత పెద్ద ప్రాజెక్టుకు సంబంధించిన పనులపై అన్ని వైపుల నుంచి సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని ఏబీ పాండ్యా అభిప్రాయపడ్డారు. భారీ ప్రాజెక్టుల విషయంలో తరచూ పరిశీలన చేసుకోక తప్పదన్నారు. స్పిల్వే డిజైన్పైనా చర్చలు జరిగినట్లు చెప్పారు. రిజర్వాయర్ ప్రాంతంలో కొన్ని మార్పులు అవసరమని గుర్తించామని.. ఆ మేరకు చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం పనులు సాగుతున్న తీరు బాగుందన్నారు. ప్రాజెక్టు ప్రణాళికను తగిన సమయంలో పూర్తి చేసి 2020 కల్లా నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు.













