సెలెక్ట్ కమిటీలకు పేర్లు పంపిన పార్టీలు
మూడు రాజధానులు, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ సెలక్ట్ కమిటీలకు పంపిన నేపథ్యంలో ఆయా కమిటీల్లో ఉండాల్సిన నేతలు జాబితాను పార్టీలు పంపించాయి. టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ నుంచి మండలి చైర్మన్ కార్యాలయానికి ఈ జాబితాలు చేరాయి. ఒక్కో కమిటీలో టీడీపీ నుంచి ఐదుగురు, బీజేపీ, పీడీఎఫ్ నుంచి ఒక్కొక్కరికి మండలి చైర్మన్ అవకాశం కల్పించారు. దానికి అనుగుణంగా మూడు రాజధానులు, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లుకు ఆయా పార్టీలు పేర్లను పంపాయి. వైకాపా నుంచి ఇంతవరకు ఎలాంటి జాబితా అందలేదని తెలుస్తోంది.
టీడీపీ నుంచి: మూడు రాజధానుల బిల్లుకు నారా లోకేశ్, అశోక్‌బాబు, తిప్పేస్వామి, బీటీ నాయుడు, సంధ్యరాణి సీఆర్డీఏ బిల్లుకు దీపక్‌రెడ్డి, బచ్చుల అర్జునుడు, బీద రవిచంద్ర, గౌనువారి శ్రీనివాసులు, బుద్దా వెంకన్న పేర్లను తెలుగుదేశం పార్టీ పంపింది.
బీజేపీ, పీడీఎఫ్ తరపున: బీజేపీ నుంచి మూడు రాజధానుల బిల్లుకు మాధవ్, సీఆర్డీఏ బిల్లుకు సోము వీర్రాజు పేర్లను పంపగా పీడీఎఫ్ తరపున మూడు రాజధానులు బిల్లుకు కె.ఎస్.లక్ష్మణరావు, సీఆర్డీఏ బిల్లుకు ఇళ్ల వెంకటేశ్వర (ఐవీ) పేర్లను ఆ పార్టీ పంపింది.













