Ursa Clusters: ఫలించని ప్రభుత్వ ఎత్తుగడ.. ఉర్సాపై ఆగని విమర్శలు..!!

విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు (Ursa Clusters Pvt Ltd) భూ కేటాయింపులపై రాజకీయ వివాదం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) ఈ రెండు సంస్థలకు విశాఖలో భూములను కేటాయించడం, దాని నిబంధనలు, ఉద్యోగ అవకాశాలు, కేటాయింపుల వెనుక ఉన్న ఉద్దేశాలపై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఉర్సా క్లస్టర్స్‌కు కేటాయించిన భూములపై వైసీపీ (YCP) నేతలు కుంభకోణ ఆరోపణలు గుప్పిస్తున్నారు. టీసీఎస్‌కు కేటాయింపులపై మాత్రం విపక్షాలకు పెద్దగా అభ్యంతరాలు లేవు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీసీఎస్‌కు విశాఖలో 21.16 ఎకరాల భూమిని కేటాయించింది. టీసీఎస్ ప్రముఖ ఐటీ సంస్థ. ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 10వేల ఉద్యోగాలను కల్పించనున్నట్లు అంచనా. ఈ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు విశాఖ ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదపడుతాయని ప్రభుత్వం చెప్తోంది. టీసీఎస్‌కు నామమాత్రపు ధర అంటే ఎకరానికి 99 పైసల చొప్పున భూమి కేటాయించింది. అయితే ఈ సంస్థ విశ్వసనీయ, ట్రాక్ రికార్డ్, ఉద్యోగ సృష్టి సామర్థ్యం వల్ల విపక్షాలకు ఈ విషయంపై పెద్దగా అభ్యంతరాలు లేవు.
ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విశాఖలో మొత్తం 59 ఎకరాల భూమిని కేటాయించారు, ఇందులో 56.36 ఎకరాలు ఎకరానికి రూ.50 లక్షల చొప్పున, 3 ఎకరాలు ఎకరానికి రూ.1 కోటి చొప్పున కేటాయించినట్లు సమాచారం. ఈ సంస్థ రూ.5,728 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ స్థాపించి, 2,500 ఉద్యోగాలను సృష్టించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఉర్సా క్లస్టర్స్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే హైదరాబాద్‌లో రిజిస్టర్ అయిన కొత్త సంస్థ. దీనికి స్పష్టమైన ట్రాక్ రికార్డ్ లేకపోవడం వివాదానికి కారణమైంది. వైసీపీ నేతలు ఈ కేటాయింపును “భూ కుంభకోణం”గా అభివర్ణిస్తున్నారు. రూ.3వేల కోట్ల విలువైన భూమిని నామమాత్ర ధరకు కేటాయించారని ఆరోపిస్తున్నారు.
టీసీఎస్ 10వేల ఉద్యోగాలు కల్పిస్తామంటూ 21.16 ఎకరాలను పొందింది. ఉర్సా క్లస్టర్స్ కేవలం 2,500 ఉద్యోగాలతో 59 ఎకరాలను పొందడం వివాదాస్పదమైంది. టీసీఎస్‌తో పోలిస్తే ఉర్సాకు ఎక్కువ భూమి కేటాయించడం, అది కూడా తక్కువ ఉద్యోగాలు కల్పిస్తుండడంతో ప్రభుత్వ ఉద్దేశాలపై అనుమానాలను రేకెత్తించింది. కూటమి ప్రభుత్వం తమ అనుకూల వ్యక్తులకు లబ్ధి చేకూర్చే కుట్ర చేస్తోందని వైసీపీ విమర్శిస్తోంది. అయితే ప్రభుత్వం, టీడీపీ నేతలు ఈ కేటాయింపులు నిబంధనల మేరకే జరిగాయని, రెండేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే భూములు వెనక్కి తీసుకుంటామని వాదిస్తున్నారు.
ఉర్సా క్లస్టర్స్ కొత్త సంస్థ. స్పష్టమైన వ్యాపార చరిత్ర లేదు. టీసీఎస్ వంటి సంస్థతో పోలిస్తే ఉర్సాకు ఎక్కువ భూమి కేటాయించడం, ఉద్యోగ సృష్టిలో తక్కువ లక్ష్యం ఉండటం ప్రభుత్వ నిర్ణయంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే, డేటా సెంటర్ వంటి ప్రాజెక్టులకు ఎక్కువ భూమి అవసరమని, భవిష్యత్తులో ఈ పెట్టుబడులు ఆర్థిక వృద్ధికి దోహదపడతాయని ప్రభుత్వం వాదిస్తోంది. కానీ ఉర్సా క్లస్టర్స్ పై ప్రభుత్వం ఎన్ని వివరణలు ఇచ్చినా అనుమానాలు మాత్రం తొలగట్లేదు. వాటిని క్లారిపై చేయగలిగితేనే అనుమానాలు నివృత్తి అవుతాయి. లేకుంటే ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.