ఒక్క అవకాశం ఇస్తే మార్పెలా ఉంటుందో చూపిస్తా: పవన్
ఉత్తరాంధ్ర ప్రజలకు వైసీపీ మోసం చేస్తోందని, జనసేనను ఒక్క అవకాశం ఇస్తే ప్రజలకు మార్పు ఎలా ఉంటుందో చూపిస్తానని విజయనగరం గుంకలాంలో పవన్ అన్నారు. అయితే అక్కడ నిర్మిస్తున్న జగనన్న కాలనీని పరిశీలించేందుకు పవన్ వెళ్లారు. అనంతరం అక్కడి ప్రజలనుద్దేశించి పవన్ మాట్లాడారు. రాజధాని పేరుతో ప్రజలకు వైసీపీ మోసం చేస్తోందని, బంగారు భవిష్యత్తుకు జనసేనను నమ్మాలని తెలిపారు. వైసీపీ చేస్తున్న మోసాలను ప్రజలు గ్రహించాలని, ఉత్తరాంధ్రులకు బలమైన రాజకీయ అధికారం దక్కాలని అన్నారు. యువత తమ శక్తిని రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు వినియోగించాలని, యువత, ప్రజల భవిష్యత్తు కోసం జనసేనను నమ్మాలని చెప్పుకొచ్చారు. ‘నాపై మీరు నమ్మకం ఉంచితే గుండాలతో పోరాడేందుకు, ఎన్ని కేసులనైనా భరించేందుకు నేను సిద్ధం. ఉపాధి కోసం మత్స్యకారులు గోవా లాంటి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. జనసేన అధికారంలోకి వస్తే వారికి ఇక్కడే ఉపాధి కల్పిస్తాం. ఇక్కడే జెట్టీలు నిర్మిస్తాం. మత్స్యకారులకు హాని కలిగించే ఏ పనినైనా జనసేన ఎదిరిస్తుంది. అవినీతిపై రాజీలేిన యుద్ధం చేద్దాం. అవినీతిని నిర్మూలన కలను నిజం చేసుకుందాం. ఉత్తరాంధ్ర సైనికులు అవినీపై, అరాచకాలపై పోరాటాన్ని ఆపొద్దు, బలంగా ఎదుర్కోండి. కేసులు పెడితే మీ వెంట నేనూ వస్తా’ అని పవన్ అన్నారు. తనను నమ్మి జనసేనకు ఒక్క అవకాశం ఇస్తే బంగారు భవిష్యత్తును మీకు అందిస్తానని, అవినీతి రహిత సమాజాన్ని అందిస్తానని, ఉపాధి కోసం పరుగులు తీయాల్సిన పరిస్థితి లేకుండా చేస్తానని తెలిపారు.













