ఆ మూడింటి పైనే అందరి దృష్టి!
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల సమరం ముగిసింది. అధికార వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. ఇవాళ మున్సిపల్ ఛైర్మన్లు, కార్పొరేషన్ మేయర్ల ఎన్నిక జరగనుంది. కార్పొరేషన్లన్నీ వైసీపీ ఖాతాలో పడ్డాయి. కాబట్టి వాటిపై ఎలాంటి డౌటూ లేదు. అయితే ఎన్నికలు జరిగిన 75 మున్సిపాలిటీల్లో రెండు చోట్ల టీడీపీ ఆధిక్యత సాధించింది. ఒక చోట మాత్రం వైసీపీలోనే వర్గపోరు నడుస్తోంది. అందుకే ఆ మూడు స్థానాలు ఎవరి ఖాతాలో పడతాయనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ పోరు ఆసక్తికరంగా సాగింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి టీడీపీ గెలుపుకోసం ప్రయత్నించారు. ఆయన ప్లాన్ వర్కవుట్ అయింది. ఇక్కడ టీడీపీకి 18 స్థానాలు దక్కాయి. వైసీపీ తరపున 14 మంది గెలుపొందారు. ఒకరు సీపీఐ తరపున గెలుపొందగా.. మరొక స్వతంత్ర్య అభ్యర్థి విజయం సాధించారు. వైసీపీకి ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యుల బలం ఉంది. ఇరు వర్గాలూ క్యాంపు రాజకీయాలు చేస్తున్నాయి. ఛైర్మన్ పీఠం కోసం తాము ప్రలోబాలకు పాల్పడబోమని వైసీపీ చెప్తోంది. టీడీపీ మాత్రం తమ సభ్యుల ఓటు చేజారకపోతే చాలు.. గెలుపు తమదేననే ధీమాతో ఉంది. దీంతో ఇక్కడ విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తిగా మారింది.
ఇక కడప జిల్లా మైదుకూరులో కూడా పోటీ నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది. ఇక్కడ మొత్తం 24 వార్డులు ఉండగా టీడీపీకి 12 దక్కాయి. వైసీపీ 11, జనసేన 1 స్థానంలో విజయం సాధించాయి. ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. వైసీపీకి ఎమ్మెల్యే, ఎంపీలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటేయనున్నారు. దీంతో విజయం వైసీపీనే వరిస్తుందని భావిస్తున్నారు. అంతేకాక టీడీపీకి చెందిన ఓ సభ్యుడిని వైసీపీ వాళ్లు కిడ్నాప్ చేసారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనసేన అభ్యర్థి వైసీపీకి ఓటేస్తే విజయం ఖాయం. ఒకవేళ అలా కాకుండా టై అయితే లక్కీడ్రా ద్వారా చైర్మన్ ను ఎంపిక చేస్తారు.
ఇక చీరాల మున్సిపాలిటీలో మరో ఆసక్తికర పరిణామం నెలకొంది. ఇక్కడ టీడీపీ ప్రభావం లేదు. అయితే వైసీపీలోనే రెండు వర్గాలు పోటాపోటీగా ఛైర్మన్ పీఠం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఎమ్మెల్యే కరణం బలరాం వర్గం వాళ్లే ఎక్కువ సీట్లు సాధించారు. దీంతో తమకే ఛైర్మన్ పీఠం దక్కాలని వాళ్లు కోరుతున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు చెందిన వాళ్లు 10 మందికి పైగా రెబెల్స్ గా పోటీ చేసి గెలుపొందారు. దీంతో తమకే ఛైర్మన్ సీటు ఇవ్వాలని ఆ వర్గం పట్టుబడుతోంది. వీళ్లద్దరితోనూ అధిష్టానం మంతనాలు జరుపుతోంది. మరి ఎవరు త్యాగం చేస్తారో.. ఎవరు పీఠం కూర్చుంటారో.. అనే ఉత్కంఠ కొనసాగుతోంది.













