ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర : కనకమేడల
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై హత్యాయత్నం జరిగిందని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందని భావిస్తున్నట్లు తెలిపారు. మంత్రి సురేశ్, వైసీపీ కార్యకర్తలపై హత్యానేరం కేసు పెట్టాలని ఆయన డిమాండ్చేశారు. చంద్రబాబు పర్యటనలో కావాలనే గొడవలు పెడుతున్నారు. ఈ ఘటనలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. మంత్రి ఆదిమాలపు సురేశ్ వైఖరి సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. వైసీపీ కార్యకర్తలు, గూండాలను మంత్రి సురేశ్ రెచ్చగొట్టారు. ఘర్షణ వాతావరణం ఉన్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. మంత్రి హోదాలో సురేశ్ వాళ్లకు ఆదేశాలిచ్చారు అని అన్నారు. చంద్రబాబును కాపాడేందుకు కమాండోలు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అడ్డుపెట్టాల్సి వచ్చిందని అన్నారు. రాళ్లు విసిరిన ఘటనలో ఇప్పటి వరకు ఎవరిపైనా కేసు నమోదు చేయకపోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. చంద్రబాబు వచ్చిన సమయంలో యర్రగొండపాలెంలో కావాలనే కరెంట్ తీసేశారని విమర్శించారు.













