Mudragada: కుటుంబం కన్నా కుర్చీ ముఖ్యం.. ఏపీ లో పెరుగుతున్న కుటుంబ రాజకీయాలు..

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు కుటుంబ సంబంధాల పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రక్తసంబంధాల కంటే రాజకీయ వైఖరులు పెద్దవిగా మారుతున్నాయి. గతంలో అన్నదమ్ములు వేర్వేరు పార్టీలకు చెందినవారై రాజకీయం చేయడం చూసాం. కానీ ఇప్పుడు చెల్లెల్లు కూడా రాజకీయంగా ముందుకు వస్తుండటంతో కుటుంబంలోని అంతః కలహాలు వెలుగులోకి వస్తున్నాయి. వైఎస్సార్ (YSR) కుటుంబం విషయానికొస్తే, జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ముఖ్యమంత్రి హోదాలో ఉండగా ఆయన సోదరి షర్మిల (Sharmila) 2021లో స్వంతంగా పార్టీ ప్రారంభించారు. కొద్ది కాలంలోనే ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. దీంతో ప్రత్యక్షంగా అన్నతోనే పోటీకి దిగారు. ఇది కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు ఎలా రాజకీయ విభేదాల్లోకి మారుతున్నాయనే దానికి ఉదాహరణగా మారింది.
ఇక తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) పార్టీలోనూ ఇదే పరిస్థితి తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ (KCR) కుమార్తె కవిత (Kavitha), తన అన్న అయిన కేటీఆర్ (KTR) పై పరోక్షంగా విమర్శలు చేస్తూ రావడం రాజకీయంగా దుమారం రేపుతోంది. పార్టీలో కేటీఆర్‌కి కీలక స్థానం ఉండగా, కవిత తండ్రిపై గౌరవం చూపుతున్నట్టే అన్నపై వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని చర్చ జరుగుతోంది. గోదావరి తీరంలో కూడా ఇప్పుడు అలాంటి కుటుంబ రాజకీయ వివాదమే మొదలయిందంటూ ప్రచారం సాగుతోంది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) కుమార్తె క్రాంతి (Kranti) తాజాగా రాసిన ఓ బహిరంగ లేఖలో చేసిన ఆరోపణలతో ఇది వెలుగులోకి వచ్చింది. తన తండ్రికి క్యాన్సర్ వచ్చిందని తెలిసిన తరువాత చూసేందుకు వెళ్లాలంటే తన అన్నయ్య గిరి (Giri) అడ్డుకున్నారని ఆమె పేర్కొన్నారు. అంతే కాకుండా తండ్రికి సరైన వైద్యం అందించడం లేదన్న ఆరోపణలు కూడా చేశారు. ఈ విషయంపై ఆమె తీవ్రంగా స్పందించినట్లు వార్తలొచ్చాయి.
ముద్రగడ పద్మనాభం ఒక శక్తివంతమైన నాయకుడిగా కాపు సామాజిక వర్గంలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కుమారుడు గిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కాగా, కుమార్తె క్రాంతి ఇటీవల జనసేనలో చేరారు. ఒకే కుటుంబంలో ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉండడం వల్లే ఈ రకమైన ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ లాభనష్టాలకన్నా కుటుంబ బంధాల విలువ నిలబెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ముద్రగడ ఆరోగ్య స్థితిపై పూర్తి సమాచారం రావాలని, అంతర్జాతీయంగా అభిమానులు కోరుతున్నారు. అన్నా చెల్లెల్ల మధ్య ఉన్న విభేదాలు పరిష్కారమవాలని అందరూ ఆశిస్తున్నారు.